దుబాయ్ లో తె.కాంగ్రెస్‌ నేతల దీపావళి సంబరాలు

 

బ్రతుకుతెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన మన భారతీయుల కష్టాలు అన్నీఇన్నీ కావు.ఎదో కష్టపడి నాలుగు రాళ్లు వెనకేసుకుందామని ఎవరినో నమ్మి వెళ్తారు.అక్కడ పని కోసం పడరాని కష్టాలు పడతారు.పని దొరికిన గొడ్డు చాకిరీ చేయాల్సిందే.సరైన ధ్రువపత్రాలు లేక అక్కడ కారాగారాల్లో మగ్గేదెందరో?.. మన తెలుగు రాష్ట్రాలకు చెందినవారు కూడా గల్ఫ్ దేశాల్లో జీవనం గడుపుతున్నారు.వారిని కలిసేందుకు తెలంగాణ పీసీసీ బృందం దుబాయి పర్యటనకు వెళ్లింది.తెలంగాణకు చెందిన వలస కార్మికులతో  ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్సీ కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి మధు యాష్కీ, మండలి విపక్ష నేత షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తదితరులు ఇవాళ భేటీ అవ్వనున్నారు.వీరంతా భారత కాలమానం ప్రకారం ఉదయం 11.30 గంటలకు దుబాయ్‌ సోనాపూర్‌లోని కార్మిక శిబిరాల్లో కార్మికులను కలిసి వారితో మాట్లాడతారు. గల్ఫ్ మేనిఫెస్టో వివరించి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారు. మధ్యాహ్నం స్వచ్ఛంద సంఘాలు, పలువురు ప్రతినిధులతో అక్కడి ఓ హోటల్లో భేటీ అవుతారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వలస కార్మికులకు ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు చేయనున్నారో వివరిస్తారు. రాత్రి 7.30గంటల నుంచి 11గంటల వరకు తెలంగాణ ప్రవాసి మిత్ర బృందం ఏర్పాటు చేసిన దీపావళి ధూమ్ ధామ్ కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రికి తిరిగి హైదరాబాద్ ప్రయాణం అవుతారు.