తెలంగాణాలో సంకీర్ణ ప్రభుత్వమే

 

తెలంగాణాలో ఎన్నికలకు ఇంకా కేవలం 6రోజులే మిగిలున్నాయి. ప్రధాన ప్రత్యర్దులయిన కాంగ్రెస్, తెరాస, తెదేపా-బీజేపీలు చాలా గట్టిగా ఎన్నికల ప్రచారం చేసుకొంటున్నాయి. కాంగ్రెస్ తరపున సోనియా, రాహుల్ గాంధీ ఇద్దరూ వచ్చి ప్రచారం చేసారు. ఉద్యమాలు జరుగుతున్న సమయంలో ఎన్నడూ రాష్ట్రం మొహం చూడని కేంద్రమంత్రి జైరామ్ రమేష్ గత నెల రోజులుగా తెలంగాణాలోనే తిష్టవేసి టీ-కాంగ్రెస్ నేతలకంటే ఎక్కువగా కష్టపడుతున్నారు. చంద్రబాబు అందరికంటే ముందుగా తెలంగాణాలో ప్రచారం మొదలుపెట్టడమే కాకుండా ఆర్. క్రిష్ణయ్యని తమ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నారు. రెండు రోజుల క్రితమే నరేంద్రమోడీ కూడా వచ్చి తెదేపా-బీజేపీ కూటమికి ప్రచారం చేసి వెళ్ళారు. వీరందరినీ తెరాస అధ్యక్షుడు కేసీఆర్ ఒక్కరే బలంగా డ్డీకొంటూ, పది జిల్లాలలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

 

ముగ్గురు ప్రధాన ప్రత్యర్ధులు దీటుగా ప్రచారం చేసుకొంటున్నందున, ఇంతవరకు తెరాస తన ప్రత్యర్ధులపై చూపుతున్న ఆధిక్యతను కోల్పోగా కాంగ్రెస్ రేసులో ముందుకు దూసుకుపోతున్నట్లు తాజా సర్వేలు చెపుతున్నాయి. అయితే అది పూర్తి మెజార్టీ సాధించేత మాత్రం కాదని సర్వేలే స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్, తెరసలతో పోలిస్తే, తెదేపా-బీజేపీ కూటమి పోటీలో వెనుకబడిపోయిందని, కానీ వారి కూటమి కూడా గౌరవనీయమయిన స్థానాలనే దక్కించుకోవచ్చని సర్వే నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 

 

తాజా నివేదిక ప్రకారం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కొంత ఆధిక్యత కనబరుస్తూ 35-45 సీట్లు సాధించుకొనే అవకాశం ఉందని సమాచారం. తెరాస-25-30, తెదేపా-బీజేపీ కూటమి-20-30, మజ్లిస్-4 to 6 మరియు ఇతరులు 8 సీట్లు సాధించవచ్చని సమాచారం.

 

కాంగ్రెస్ తరపున తెలంగాణాలో ప్రచారం చేస్తున్న జైరామ్ రమేష్ “ఎన్నికల తరువాత తెరాస మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసే దుస్థితి తమకు రాదని, తమ పార్టీయే స్వయంగా మెజార్టీ సీట్లు సాధించుకొని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని” విశ్వాసం వ్యక్తం చేసారు.

 

కేసీఆర్ మొన్న ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ తమ పార్టీకే గనుక పూర్తి మెజార్టీ రానట్లయితే, కాంగ్రెస్ మద్దతు తీసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయడం కంటే ఫారం హౌస్ లో వ్యవసాయం చేసుకోవడానికే ఇష్టపడతానని అన్నారు. అంటే ఎవరికీ పూర్తి మెజార్టీ రాదని వారు కూడా అప్పుడే గ్రహించినట్లు అర్ధమవుతోంది. అందుకే వారిరువురూ మద్దతు తీసుకోవడం గురించి మాట్లాడుతున్నారిప్పుడు.

 

అయితే, కేంద్రంలో, రాష్ట్రంలో కూడా చక్రం తిప్పాలని, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలని తహతహలాడిపోతున్న కేసీఆర్ నిజంగానే ఆ పరిస్థితి వస్తే, నిజంగా ఫారం హౌస్ కి వెళ్లిపోతారని అనుకోవడం అవివేకమే. అవసరమయితే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చో, పుచ్చుకోనయినాసరే ముఖ్యమంత్రి పదవి లేకపోతే కనీసం ఆర్ధిక శాఖ, హోంశాఖనో పుచ్చుకొని సంతృప్తి పడవచ్చును. అంటే ఎన్నికల తరువాత అధికారం చేజిక్కించుకొనేందుకు కాంగ్రెస్-తెరాసలు తప్పనిసరిగా మళ్ళీ చేతులు కలుపుతాయని అర్ధమవుతోంది. ఒకవేళ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే మాటయితే తెరాస-కాంగ్రెస్ పార్టీకి బదులు బీజేపీ మద్దతు తీసుకొనే అవకాశం ఉంది. అంటే తెలంగాణాలో సంకీర్ణ ప్రభుత్వమేర్పడే అవకాశాలే ఎక్కువని అర్ధమవుతోంది.