తెలంగాణపై తెదేపా కూడా మాట మారుస్తుందా

 

ఈ రోజు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాష్ట్ర విభజనపై మాట్లాడిన తీరు చూస్తే, క్రమంగా ఆ పార్టీ కూడా వైకాపా మార్గంలోనే పయనించేందుకు సిద్దం అవుతున్నట్లు కనిపిస్తోంది. రెండు రోజుల క్రితం వైకాపా శాసనసభ్యులు కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రశ్నించినట్లే “ఎవరిన డిగి రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకొంటోందని” ఆయన ప్రశ్నించారు. ప్రజలు తెలంగాణా కోసం అడుగుతుంటే కాంగ్రెస్ రాయల తెలంగాణా అని మాట్లాడటం ఏమిటని ఆయన ప్రశించారు. కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం, తన రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర విభజనకి ఆలోచనలు చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. ముందుగా రాజధాని, జలవనరుల పంపిణీ, రెవెన్యు మొదలయిన అంశాలను పరిష్కరించకుండా విభజనకు సిద్దపడితే తాము ఉద్యమిస్తామని అన్నారు. సోమిరెడ్డి ఇంకా చాల అంశాలు ప్రస్తావించి నప్పటికీ, ఆయన రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తున్నట్లు తన మాటలతో స్పష్టం చేసారు.

 

చంద్రబాబు అనుమతి లేకుండా సోమిరెడ్డి ఈవిధంగా మాట్లాడే అవకాశం లేదు, గనుక ఆయన తమ పార్టీ అభిప్రాయం వెలువరిస్తునట్లుగానే భావించవలసి ఉంటుంది. మరి ఇంతవరకు తమ పార్టీ తెలంగాణకు అనుకూలమని ప్రకటిస్తూ వచ్చిన తెదేపా కూడా ఇప్పుడు హటాత్తుగా “ఎవరిని అడిగి విభజిస్తున్నారని” ప్రశ్నించడం చూస్తే, నేదో రేపో ఆ పార్టీ శాసనసభ్యులు కూడా రాజీనామాలతో రంగంలో దిగవచ్చునని అనిపిస్తోంది. అఖిలపక్షంలో రాష్ట్ర విభజనకు తమకు అభ్యంతరం లేదని స్పష్టంగా చెప్పిన తెదేపా ఇప్పుడు మళ్ళీ మాట మార్చితే తెలంగాణాలో భంగపాటు తప్పదు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నిస్తున్నసోమిరెడ్డి, మరి తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా మాట్లాడటలేదనే సంగతిని విస్మరించడం విశేషం.