రౌడీ ఎమ్మెల్యేలను తరిమికొడతా.. చంద్రబాబు విశ్వరూపం 

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల ప్రచారంలో ఉగ్రరూపం ప్రదర్శించారు  టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. శ్రీకాళహస్తి రోడ్ షోలో  వైసీపీ సర్కారు, సీఎం జగన్ పై ఆయన తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో అరాచక పాలన సాగుతుందన్నారు చంద్రబాబు. ఈ ఎమ్మెల్యేలు పెద్ద రౌడీలా? అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీలను కూడా పరిగెత్తిస్తాం తప్ప రౌడీలకు భయపడే సమస్యేలేదని స్పష్టం చేశారు.  ఎన్నికల ముందు జగన్ ముద్దులు పెట్టుకుంటూ పోయాడు.. ఇప్పుడా ముద్దులన్నీ ఏమైపోయాయి? ప్రజలకు గుద్దులే మిగిలాయి అని చంద్రబాబు అన్నారు. 

ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని అడుగుతూనే ఉంటాడట.. అడుగుతూనే ఉండడానికా నీకు ఓటేసింది? నీ నంగి మాటలు మాకు చెబుతావా? నీ వైఖరితో ప్రత్యేక హోదా పోయింది, పెట్టుబడులు పోయాయి అని చంద్రబాబు మండిపడ్డారు. కేసులకు భయపడి ఇంట్లో ఉంటే సమాజం ఎలా బాగుపడుతుంది? రాష్ట్రం దివాళా తీసిన తర్వాత చేయడానికి ఏం ఉండదు.. ప్రజలు ముందుకొచ్చి పోరాడితేనే ఫలితం ఉంటుంది  అంటూ సీఎం జగన్ పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రజలు కూడా టీడీపీ పాలనకు, వైసీపీ పాలనకు తేడా గమనించాలన్నారు చంద్రబాబు. తిరుపతి ఉప ఎన్నికతోనే మార్పుకు శ్రీకారం చుట్టాలన్నారు.  కొంప కాలిపోయిన తర్వాత తీరిగ్గా బయటికొచ్చి బావి తవ్వితే ఏం ఉపయోగం ఉండదని చెప్పారు. తాను తిరుపతి వచ్చింది పదవి కోసం కాదు... టీడీపీ తరఫున ఓ ఎంపీ గెలిస్తే మరింత బలం పెరుగుతుందని రాలేదు. అరాచకానికి అడ్డుకట్ట వేయాలంటే అది మీ చేతుల్లోనే ఓటు రూపంలోనే ఉందన్న విషయాన్ని గుర్తు చేయడానికి వచ్చానని తెలిపారు. ఇప్పుడందరూ తానే ముఖ్యమంత్రిగా రావాలంటున్నారన్నారు చంద్రబాబు. నాకేమైనా సీఎం పదవి కొత్తా! 14 ఏళ్లు చేశాను. నా రికార్డు ఎవరూ బద్దలు కొట్టే పరిస్థితి లేదు.. 9 ఏళ్లు సమైక్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఉన్నాను. అదొక రికార్డు. పదేళ్లు విపక్షనేతగా ఉన్నాను. మళ్లీ రెండు రాష్ట్రాలు కలవవు కాబట్టి నా రికార్డు పదిలంగా ఉంటుంది అని చంద్రబాబు చెప్పారు. 

తిరుపతి ఉప ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది కాబట్టే ఎలాంటి సమస్య లేదన్నారు. తాను ఎలాంటి సమస్య లేకుండా నడచి వచ్చానని చెప్పారు. "అదే అధికారి, ఇదే పోలీసులు, ఇదే తహసీల్దారు, అదే కలెక్టరు... పంచాయతీ ఎన్నికల సమయంలో మీరు ఏవిధంగా ప్రవర్తించారు? ఇప్పుడు ఏవిధంగా ఉన్నారు? ప్రజలే గమనించాలన్నారు చంద్రబాబు. మీకు ప్రజాస్వామ్యం కావాలా వద్దా? ఇదే అంశాన్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. మా తప్పేదైనా ఉంటే ప్రజలకు వివరించాలి కాని  తప్పుడు కేసులు పెడతారా? అని టీడీపీ అధినేత నిలదీశారు.