తెలంగాణాలో దూసుకుపోతున్న తెదేపా

 

తెలంగాణా ఉద్యమాలు, రాష్ట్ర విభజన వ్యవహారాలలో తెలంగాణాలో బాగా దెబ్బతిన్న తెదేపా మళ్ళీ క్రమంగా పుంజుకొని ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, తెరాసలకు ఎదురునిలిచి పోరాడగల ఆత్మస్థయిర్యాన్ని ప్రదర్శిస్తోంది. ఒకవేళ బీజేపీతో పొత్తులు కూడా ఖరారయినట్లయితే, తెలంగాణా సాధించిన కారణంగా గెలుపు ఖాయమని భావిస్తున్న తెరాస, కాంగ్రెస్ పార్టీలు రెండూ కూడా చెమటోడ్చక తప్పని పరిస్థితి ఏర్పడినా ఆశ్చర్యం లేదు. కొద్ది రోజుల క్రితం మెహబూబ్ నగర్ లో తెదేపా నిర్వహించిన ప్రజాగర్జన సభకు ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది. అందుకే మళ్ళీ వెంటనే మరో రెండు సభలు నిర్వహించేందుకు తెదేపా సిద్దం అవుతోంది.రేపు వరంగల్లో,ఎల్లుండి కరీంనగర్ లో ప్రజాగర్జన బహిరంగ సభలు నిర్వహించేందుకు తెదేపా భారీ సన్నాహాలు చేస్తోంది.

 

బీజేపీతో పొత్తుల విషయం కూడా తేలిపోయిన తరువాత, ఆ పార్టీ నేతలతో కలిసి మరిన్ని సభలు నిర్వహించాలని తెదేపా భావిస్తోంది. ఒకవేళ పొత్తులు కుదరకపోయినట్లయితే, తెదేపా వెంటనే తన అభ్యర్ధుల పేర్లను ప్రకటించి వారితో కలిసి ప్రచారం మొదలుపెట్టేందుకు సిద్దంగా ఉంది. ఏమయినప్పటికీ, తెదేపా తెలంగాణాలో ఊహించని విధంగా మళ్ళీ బలం పుంజుకొని తన ప్రత్యర్ధుల కంటే ముందు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.