తెదేపా-బీజేపీ పొత్తులు సాధ్యాసాధ్యాలు

 

రాష్ట్రంలో అన్ని పార్టీలకు వచ్చేఎన్నికలు జీవన్మరణ పోరాటంవంటివే. సీమాంధ్రలో తెదేపా, వైకాపా, కిరణ్ లేదా వేరొక కాంగ్రెస్ నేత పెట్టబోయే కొత్త పార్టీల మధ్య త్రిముఖపోటీ ఉంటే, తెలంగాణాలో తెరాస, తెదేపా, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ ఉండవచ్చును. రెండు ప్రాంతాలలో కాంగ్రెస్ నేరుగా పోటీ చేయబోతునప్పటికీ, అది తెలంగాణాలో తెరాసతో, సీమంధ్రలో వైకాపా, కొత్త పార్టీలతో లోపాయికారిగా ఒప్పందాలు చేసుకొనే అవకాశం ఉంది గనుక, కాంగ్రెస్ పార్టీని ప్రధానపోటీదారుగా భావించనవసరం లేదు. కానీ, కాంగ్రెస్ బలంగా ఉన్నచోట మాత్రం తన అభ్యర్ధులనే నిలబెడితే, వారిపై కాంగ్రెస్ పార్టీతో రహస్య అవగాహన కలిగిన పార్టీలు డమ్మీ అభ్యర్ధులను నిలబెట్టి కాంగ్రెస్ అభ్యర్ధి గెలుపుకు పరోక్షంగా సహకరించవచ్చును. కాంగ్రెస్ కూడా ఆ పార్టీల అభ్యర్ధుల విషయంలో అదేవిధంగా వ్యవహరించవచ్చును. తద్వారా వేరువేరు జెండాలతో ప్రజల ముందుకు వస్తున్నకాంగ్రెస్ మరియు దాని అనుబంధ పార్టీలు అన్నీకలిసి ఓట్లను చీల్చి సీమాంధ్రలో తెదేపాను, తెలంగాణాలో బీజేపీని అడ్డుకొనే ప్రయత్నం చేయవచ్చును. బహుశః ఈ పరిణామాలను ముందుగా ఊహించబట్టే తెదేపా, బీజేపీలు పొత్తులకు సిద్దమవుతున్నాయేమో.

 

అవి రెండు పొత్తులు పెట్టుకొన్నట్లయితే, వాటిలో ఎక్కువ లాభపడేది బీజేపీ అనిచెప్పక తప్పదు. ఎందుకంటే రాష్ట్ర విభజన కారణంగా తెలంగాణాలో తెదేపా కొంత బలహీన పడినప్పటికీ, బీజేపీ కంటే తెదేపాకే బలమయిన క్యాడర్ ఉంది. కానీ, మొదటి నుండి బీజేపీ తెలంగాణాకు మద్దతుగా ఉద్యమిస్తుండటంతో బీజేపీ కూడా చాల బలపడింది. అయినప్పటికీ, అది ఒంటరిగా కాంగ్రెస్-తెరాస కూటమిని ఎదుర్కొని నిలవలేదు. అందువల్ల కిషన్ రెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి వంటి బీజేపీ నేతలకు తెదేపాతో పొత్తులు ఎంత మాత్రం ఇష్టం లేకపోయినా కాంగ్రెస్-తెరాస కూటమిని డ్డీకొనాలంటే తెలంగాణాలో కూడా తెదేపాతో పొత్తులకు అంగీకరించక తప్పదు. ఇక సీమాంధ్రలో చాలా బలహీనంగా ఉన్నబీజేపీ, తెదేపాతో పొత్తులు పెట్టుకొంటేనే లాభపడుతుంది. లేకుంటే, తెదేపా, వైకాపా, కొత్త పార్టీల మధ్య సాగే పోటీలో కనబడకుండా మాయమయిపోతుంది. ఒకవేళ తెలంగాణాలో కాంగ్రెస్-తెరాసలు చేతులు కలిపినట్లయితే, తెదేపా, బీజేపీల మధ్య పొత్తులు అనివార్యం అవుతాయి. అదేవిధంగా సీమంధ్రలో మాత్రం కాంగ్రెస్ మరియు వైకాపా, కొత్త పార్టీల మధ్య ఉన్న రహస్య అవగాహన దృష్ట్యా తెదేపా, బీజేపీలు పొత్తులు పెట్టుకోవచ్చును.