వె(ప)న్నుపోటు దార్లపై "నేమ్ అండ్ షేమ్" అస్త్రం

దేశాన్ని ఉగ్రవాదుల కంటే ఎక్కువగా నష్టపరుస్తోంది ఎవరు అంటే పన్ను ఎగ్గొట్టేవాళ్లేనని ఖచ్చితంగా చెప్పవచ్చు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన  కోట్ల రూపాయల బకాయిలను బినామీల పేరు మీదనో లేదంటే బ్లాక్‌మనీ రూపంలోనో దేశం దాటిస్తున్నారు ఈ కేటుగాళ్లు. బకాయిలు చెల్లించాలని ఎన్నిసార్లు నోటీసులు పంపినా అటు నుంచి స్పందన ఉండదు. అధికారులు దాడులు నిర్వహించినా పన్ను ఎగవేతదార్లు ఎక్కడున్నదీ సమాచారం లేకపోవడంతో పన్నులు వసూలుకాక తలపట్టుకుంటోంది ఆదాయపు పన్నుశాఖ. ఇప్పటి వరకు వసూలుకాని పన్ను బకాయిలు లక్షకోట్ల వరకూ ఉన్నాయి. దీనికి తోడు పన్ను ఎగవేతదారులు బినామీ పేరిట ఆస్తులు సృష్టిస్తుండటం అధికార్లకు మరింత తలనొప్పిగా మారింది.

 

ఇలాంటి వారి భరతం పట్టడానికి ఆదాయపుపన్ను శాఖ కొత్త అస్త్రాన్ని బయటకు తీస్తోంది. సరికొత్తగా రూపొందించిన ఈ విధానం కింద రూ.1 కోటి అంతకంటే ఎక్కువ పన్నును ఎగవేసే వ్యక్తుల పేర్లను ఆదాయపు పన్ను శాఖ ప్రముఖ దినపత్రికల్లో ప్రచురించనుంది. సదరు వ్యక్తుల పేర్లు, చిరునామాలు, పాన్, ఫోన్ నెంబర్లు సహా మొత్తం వివరాలను దినపత్రికల్లో ప్రకటించడం ద్వారా సమాజంలో వారికి విలువ లేకుండా చేయడమే లక్ష్యంగా ఆదాయపుపన్ను శాఖ కసరత్తు చేస్తోంది. దీనితో పాటు వీరి ఆచూకీ తెలిపిన వారికి నగదు బహుమతులు అందజేయాలని ఐటీ శాఖ భావిస్తోంది. ఇప్పటికే ఈ దిశగా పనిని ప్రారంభించిన ఆదాయపు పన్నుశాఖ..గతేడాది నుంచి ఇప్పటి వరకు 67 మంది పేర్లను బయటపెట్టింది. మొదట్లో రూ.20 నుంచి 30 కోట్ల పన్నును ఎగవేసిన వారి పేర్లనే బయటపెట్టాలని భావించిన ఐటీశాఖ తాజాగా రూ.1 కోటి పన్నును ఎగవేసిన వారి గుట్టును బయట పెట్టాలని ప్రణాళిక సిద్ధం చేస్తోంది. తాము పన్ను ఎగవేసినట్టు సమాజానికి తెలిసిపోయిందన్న భావనతోనైనా వారు సిగ్గుపడి ప్రభుత్వానికి బకాయిలు చెల్లిస్తారని ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ అంచనా వేస్తోంది. మరి ఈ ప్రణాళిక ఎంత వరకు విజయవంతమవుతుందో వేచి చూడాలి.