తమిళనాడు రాజకీయ అనిశ్చితి ఆంధ్ర, తెలంగాణాలకు వరంగా మారనుందా??

 

 

జయలలిత జైలుపాలవడంతో తమిళనాడు రాష్ట్రంలో తలెత్తిన రాజకీయ అనిశ్చిత పరిస్థితులు ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాలకు ఎంతో కొంత మేలు చేయకపోవని మార్కెట్ నిపుణులు అంచనా వేయడం చూస్తుంటే ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే చుట్టకు నిప్పు దొరికిందని సంబరపడ్డట్టుంది. పరిశ్రమలను, పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలో తమిళనాడు రాష్ట్రం చాలా ముందుంది. అందుకే ఆ రాష్ట్రానికి $13బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు తరలివచ్చాయి. ప్రపంచంలో ప్రసిద్ధి గాంచిన ఫార్ట్యూన్-500 కంపెనీలలో నిస్సాన్, ఫోర్డ్, హుండాయ్, మిత్సుబిషి, యమహ, డెల్, డైమ్లర్, డెల్ఫీ వంటి కొన్ని కంపెనీలు తమిళనాడులో అనేక ఏళ్ల క్రితమే తమ సంస్థలను స్థాపించి చాలా సజావుగా వ్యాపారాలు నిర్వహించుకొంటున్నాయంటేనే ఆ రాష్ట్రం పెట్టుబడులకు ఎంత అనువయిన ప్రదేశమో స్పష్టమవుతోంది. అందుకు ప్రధాన కారణం కరుణానిధి నేతృత్వంలోని డీ.యం.కె. పార్టీ, జయలలిత నేతృత్వంలోని ఏ.ఐ.ఏ.డీ.యం.కె.పార్టీలు రాజకీయంగా ఎంత ద్వేషించుకొంటున్నా, తమ విభేదాలు ప్రభుత్వ పాలసీలను ప్రభావితం చేయకుండా జాగ్రత్త పడటమేనని చెప్పవచ్చును. అందుకే అక్కడ ఎన్ని సార్లు ప్రభుత్వాలు మారినా రాష్ట్రంలోకి పరిశ్రమలు, పెట్టుబడుల ప్రవాహం మాత్రం యధాతధంగా కొనసాగుతోంది.

 

కానీ ఇప్పుడు అక్రమాస్తులకేసులో జయలలితకు జైలు శిక్షపడటంతో ఈ పరిస్థితి ఎక్కడికి దారి తీస్తుందో అని వ్యాపార, పారిశ్రామిక వర్గాలలో కొంచెం ఆందోళన మొదలయిందని మార్కెట్ నిపుణులు చెపుతున్నారు. కానీ జయలలితకు నమ్మినబంటు వంటి పన్నీర్ సెల్వంకే ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించబడ్డాయి కనుక ఆయన జయలలిత ప్రభుత్వం అమలు చేస్తున్న పాలసీలలో ఎటువంటి మార్పులు, చేర్పులు చేసే సాహసం చేయబోరు కనుక రాష్ట్రంలో పెట్టుబడులకు డోకా ఉండబోదని మళ్ళీ వారే శలవిస్తున్నారు.

 

అయితే జయలలితకు బెయిలు దొరుకుతుందా లేదా? ఆమెకు పై కోర్టులు కూడా అదే శిక్షను ఖరారు చేస్తాయా? లేక ఆమె శిక్షను తగ్గిస్తాయా? వంటి అనేక అంశాలు తమిళనాడు రాష్ట్ర రాజకీయాలపైనే కాదు, పరిశ్రమలు, పెట్టుబడులపై కూడా తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణుల అంచనా. రాష్ట్రంలో ఏర్పడిన ఈ రాజకీయ అనిశ్చిత పరిస్థితులు అభివృద్ధిలో పోటీపడుతున్న ఆంధ్ర-తెలంగాణా రాష్ట్రాలకు ఎంతో కొంత మేలు చేయవచ్చని వారు భావిస్తున్నారు. రెండు రాష్ట్రాలు పోటాపోటీగా చాలా ఆకర్షణీయమయిన ఐ.టీ.,పారిశ్రామిక విధానాలు ప్రకటిస్తుండటం, పెట్టుబడులను ఆకర్షించేందుకు అనేక రాయితీలు, తాయిలాలు ఇవ్వజూపుతుండటం వంటివి, ఇప్పుడు తమిళనాడులో కొత్తగా పెట్టుబడులు పెట్టదలచుకొన్న వారిని పునరాలోచనలో పడేయవచ్చని మార్కెట్ నిపుణుల అంచనా.

కానీ తమిళనాడు ప్రభుత్వం మాత్రం ఈ ఊహాగానాలను తేలికగా కొట్టిపడేస్తోంది. రాజకీయాలకు అతీతంగా తమ ప్రభుత్వ పాలసీలు కొనసాగుతున్నదున, ప్రస్తుత రాజకీయ అనిశ్చితి మార్కెట్లు, పెట్టుబడులు, పరిశ్రమలపై ఎటువంటి ప్రభావము చూపదని దృడంగా నమ్ముతోంది. ఆ వాదనలో కూడా బలం ఉందని చెప్పవచ్చును. ఎందుకంటే ఇన్నేళ్ళలో తమిళనాడు రాష్ట్రంలో అనేక సార్లు ఇటువంటి రాజకీయ అనిశ్చిత పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ వాటి కారణంగా ఏనాడూ అక్కడి నుండి పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోలేదు. ఇప్పుడు కూడా అంతేనని ప్రభుత్వ వాదన. పరిశ్రమలు, పెట్టుబడిదారులు కూడా వడ్డించిన విస్తరివంటి తమిళనాడును కాదనుకొని, ఏవిధంగాను స్థిరపడని ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాలకు బయలుదేరిపోతాయని ఊహించలేము.

 

తమిళనాడు రాష్ట్రంలో ఈ పరిస్థితులు సద్దుమణిగేలోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేక హోదాను సంపాదించు కోగలిగితే, అది తప్పకుండా తమిళనాట పెట్టుబడులను రాష్ట్రంవైపు ఆకర్షించవచ్చని భావిస్తున్నారు. ఆ భరోసాతోనే హీరో మోటార్ సైకిల్స్ తయారీ సంస్థ చెన్నైకి అతిసమీపంలో ఉన్న చిత్తూరు జిల్లా శ్రీసిటీలో తమ సంస్థను స్థాపించడానికి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసింది. కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత త్వరగా ప్రత్యేక హోదా సాధించుకోగలదనే అంశం కూడా తమిళనాట పరిశ్రమలు, పెట్టుబడులపై ప్రభావం చూపవచ్చును. ముఖ్యంగా తమిళనాడులో పెట్టుబడులు పెట్టాలా వద్దా? అని ఇంకా ఊగిసలాడుతున్న వారిని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ‘ప్రత్యేక హోదా’ చాలా ఊరిస్తోంది. అందుకే జయలలిత ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వవద్దంటూ ప్రధాని మోడీకి లేఖ వ్రాసిన సంగతిని ఈసందర్భంగా నిపుణులు గుర్తుకు చేస్తున్నారు. ఏమయినప్పటికీ ఆంధ్ర, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా తమ కొత్త పాలసీలతో, తాయిలాలతో తమిళనాట పరిశ్రమలను, పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలు మాత్రం ఉన్నాయని చెప్పవచ్చును.