తండ్రుల తహ తహ!
posted on Jun 14, 2013 10:53AM

"హ్యాపీడేస్" చిత్రంతోనే లక్షలాది పురుష పుంగవులు వయోభేదం లేకుండా తమన్నాపై మనసు పారేసుకున్నారు. "రచ్చ" సినిమా ఆమె కోసమే ఆడిందన్న అందమైన ఆరోపణలు సైతం తమన్నా ఎదుర్కోవటం మనకు తెలుసు. సామాన్య ప్రేక్షకులు, కుర్ర హీరోలు మాత్రమే కాదు.. వయసు మళ్లిన హీరోలు సైతం ఆమెతో నటించాలని తహతహలాడుతుండడం చర్చనీయాంశమవుతోంది. "రచ్చ" ఆడియో ఫంక్షన్‌లో తమన్నాను చూస్తుంటే.. తన ఒకవేళ 150వ చిత్రంలో నటిస్తే ఆ చిత్రంలో తమన్నాను హీరోయిన్‌గా పెట్టుకోవాలనిపిస్తోందని చిరంజీవి ప్రకటిస్తే.. రీసెంట్‌గా అదే పని నాగార్జున కూడా చేసేసారు. "తడాఖా" ఆడియో ఫంక్షన్‌లో తమన్నా అందాలపై ప్రత్యేక ప్రశంసలు కురిపించిన నాగార్జున.. ఆమెతో నటించాలని ఉందంటూ తన ఆ"కాంక్ష"ను వెలిబుచ్చారు. తమ కుమారులతో నటించిన హీరోయిన్‌తో తాము నటించాలని ఈ ఇద్దరూ సరదా కోసమైనా ఆశపడడం.. తమన్నాకు గల క్రేజ్‌ను తేటతెల్లం చేస్తున్నది. తండ్రి సరసన నటించిన శ్రీదేవితో ఏకంగా రెండు చిత్రాల్లో నటించిన నాగార్జున.. తన కుమారుడు నాగచైతన్యతో రెండు సినిమాల్లో నటించిన తమన్నాతో ఒక చిత్రంలోనైనా నటిస్తాడేమో చూడాల్సిందే!