టీ-బిల్లుపై కాంగ్రెస్ పెద్దల కొత్త కబుర్లు

 

రాష్ట్ర విభజన అంశం మళ్ళీ డిల్లీకి మారింది. ఇంతవరకు బిల్లుపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తలోమాట మాట్లాడితే, ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానంలో పెద్దలు తలోమాట మాట్లాడటం మొదలు పెట్టారు. శాసనసభ బిల్లుని తిరస్కరించిన వార్త వెలువడిన వెంటనే స్పందించిన దిగ్విజయ్ సింగ్, దాని వల్ల బిల్లుకొచ్చే నష్టమేమీ లేదని, రాష్ట్ర విభజన ఆగబోదని ప్రకటించారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడిన హోం మంత్రి షిండే బిల్లుపై నిర్ణయం తీసుకోవడానికి తమకు కొంత సమయం అవసరమని, బిల్లుని శాసనసభ వ్యతిరేఖించినందున అటార్నీ జనరల్ని సంప్రదించి న్యాయసలహా తీసుకుంటామని తెలిపారు. ఈ నెల 4వతేదీన జరిగే మంత్రుల బృందం సమావేశంలో శాసనసభ లేవనెత్తిన అన్నిఅంశాల గురించి చర్చించి తగు నిర్ణయం తీసుకొంటామని ఆయన చెప్పారు. బిల్లుపై స్పందించిన ఇద్దరిలో ఒకరు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తే, మరొకరు న్యాయసలహా తీసుకొంటామని చెప్పడం విశేషం. బహుశః త్వరలో చాకో, ఆజాద్, తివారీ, జైపాల్ రెడ్డి వంటి మరికొందరు మీడియా ముందుకు వచ్చి బిల్లుపై మరిన్నికొత్త కబుర్లు చెపుతారేమో!