బాండ్లు "గోపి"లను ఆపుతాయా...?

ఇటీవలి కాలంలో రాజకీయాల్లో ఫిరాయింపులు ఎక్కువైపోతున్నాయి. చివరి శ్వాస వరకు మీ వెంటే..ప్రాణాలైనా ఇస్తాం గాని పార్టీలు మారం అని ప్రమాణాలు చేసిన వాళ్లే ఏమాత్రం సిగ్గు లేకుండా పార్టీలు మారుతున్నారు. అధికార పార్టీ బలంగా ఉంటే చాలు..విపక్షాల ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసో..లేక మరేదైనా అస్త్రాన్ని ఉపయోగించో తమ వైపు తిప్పుకోవడం మామూలైపోయింది. దేశంలో అన్ని పార్టీలను ఈ సమస్య పట్టిపీడిస్తోంది..దీనికి పరిష్కారం కోసం అన్ని పార్టీలు అన్వేషిస్తూనే ఉన్నాయి. దేశంలో ఇలాంటి "ఆకర్ష్‌"లకు ఆది గురువు కాంగ్రెస్ పార్టీ అని చెప్పవచ్చు. కాని చివరకు తాను తీసిన గోతిలో తానే పడింది. రాజకీయాల్లో కాకలు తీరిన కాంగ్రెస్ ఇప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటోంది.

 

ఇటీవల జరిగిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవి చూసిన కాంగ్రెస్ సుధీర్ఘకాలం తర్వాత ప్రతిపక్ష హోదా సాధించింది. అయితే తమ ఎమ్మెల్యేలు ఎక్కడ పార్టీలు మారుతారోనన్న భయంతో ఫిరాయింపులను తట్టుకునేందుకు ఓ కొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఎన్నికైన శాసనసభ్యుల చేత తాము కాంగ్రెస్ పార్టీకి, సోనియా, రాహుల్ గాంధీలకు విధేయులుగా ఉంటామని రూ.100 స్టాంప్ పేపర్‌పై రాసి ఇవ్వాలని ఎమ్మెల్యేలను ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు అధీర్ చౌదరి ఆదేశించారు. పార్టీకి వ్యతిరేకంగా ఏ కార్యకలాపాలు చేయబోమని అందులో పేర్కొనాలని ఆయన ఆదేశించారు. దీనిపై చౌదరి స్పందిస్తూ ప్రజా ప్రతినిధులతో బలవంతంగా సంతకాలు పెట్టించడానికి ఇదేమి బాండ్ కాదని, కాని పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించకుంటే, వారిపై చర్యలు తీసుకునేందుకు ఇది ఉపకరిస్తుందని వ్యాఖ్యానించారు.