మద్యం అమ్మకాలను నిషేధించాలని ఆదేశాలివ్వలేం: సుప్రీం

మద్యం అమ్మకాలను నిషేధించాలని ఆదేశాలివ్వలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. మద్యం అమ్మకాలపై రాష్ట్రాలవి విధానపరమైన నిర్ణయాలని.. ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. మద్యం కొనుగోలు సమయంలో చాలాచోట్ల భౌతిక దూరం పాటించడం లేదని, అందువల్ల మద్యం అమ్మకాలపై నిషేధం విధించాలని సుప్రీంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను శుక్రవారం విచారించిన అనంతరం సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది.

అయితే.. రాష్ట్రాలు మద్యం అమ్మకాలకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను పాటించాలని ధర్మాసనం సూచించింది. రాష్ట్రాలు మద్యం అమ్మకాలకు ఆన్‌లైన్‌ విధానాన్ని అనుసరించాలని, ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకున్న వారికి మద్యాన్ని హోం డెలివరీ చేయాలని సుప్రీం కోర్టు రాష్ట్రాలకు సూచించింది.