కడప స్టీల్‌ ప్లాంట్‌ కి గ్రీన్ సిగ్నల్.. త్వరలో శంకుస్థాపన

 

కడప జిల్లాలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.18వేల కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టాలని మంత్రి వర్గం నిర్ణయించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నెల రోజుల్లోపు ఓ మంచి రోజు చూసుకుని స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం నెరవేర్చని హామీలను రాష్ట్రమే చేపట్టేలా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

రాయలసీమ స్టీల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దొనకొండ మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌కు ఆమోదం తెలిపారు. పోర్టు ఏర్పాటుకు రామాయపట్నం అన్ని విధాలుగా అనుకూలమనే దిశగా కీలక చర్చలు చేస్తున్నట్టు సమాచారం. రూ. 8,300 కోట్లతో 42 కిలోమీటర్ల మేర వైజాగ్ మెట్రో నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. అన్న క్యాంటీన్ల నిర్వహణకు ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని మున్సిపల్‌ ప్రాంతాల్లో 125, గ్రామీణ ప్రాంతాల్లో 152 క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 44 క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నారు. జనవరి 31 నాటికి అన్న క్యాంటీన్ల నిర్మాణాలను పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 124 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

రాష్ట్రం పట్ల కేంద్రం చూపుతున్న వివక్షపై కీలకంగా చర్చించినట్టు సమాచారం. కడప స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుపై కేంద్రానికి లేఖరాయాలని కూడా నిర్ణయించినట్టు తెలుస్తోంది. రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చడంలేదంటూ సీఎం చంద్రబాబు కేంద్రానికి రెండోసారి లేఖ రాయాలని నిర్ణయించారు. తిత్లీ తుపానుకు రూ.3,600 కోట్ల పైచిలుకు నష్టం వాటిల్లినట్లు అంచనాలు పంపడంతోపాటు తక్షణ సాయంగా రూ.1200 కోట్లు విడుదల చేయాలని కోరగా.. కేవలం రూ.229 కోట్లు మాత్రమే ఇవ్వడంపై రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తితో ఉంది. దీనిపైకేంద్ర హోంమంత్రికి మరోసారి లేఖ రాయనున్నారు.