ఆ విషయంలో శివాజీ సక్సెస్ అయినట్టే..

 

ఇప్పటికే ఏపీ ప్రత్యేక హోదాపై... పార్లమెంట్ అవిశ్వాస తీర్మానంపై గందరగోళం నెలకొంది. ఒకపక్క పార్టీలు ఒకరిమీద మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. ఎవరికి ఎవరు ఫేవరో.. ఎవరికి ఎవరు శత్రువులో కూడా తెలియని గజిబిజి గందరగోళంలో పడిపోయారు జనాలు. ఇంత కన్ఫ్యూజన్ లో ఉండగా.. హీరో శివాజీ ఆపరేషన్ గరుడ అంటూ మరో బాంబు పేల్చాడు. ఉన్న కన్ఫ్యూజన్ తోనే చస్తుంటే ఇప్పుడు ఈ ఆపరేషన్ గరుడ అంటూ పెద్ద థీరమే చెప్పాడు. ఇప్పుడు ఈ ‘ఆపరేషన్ గరుడ’ అంశం రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తుంది. జాతీయ పార్టీ ఒకటి ఆపరేషన్ గరుడ స్టార్ట్ చేసిందని... అది 2017లో మొదలైందని.. దానికోసం ఇప్పటికే 4800కోట్లు ఖర్చుచేయనున్నారని తెలిపారు. ద్రవిడ అంటే సౌత్ ఇండియా.. ఏపీలో దీనికి ఆపరేషన్ గరుడ అని... తమిళనాడు, కేరళకు సంబంధించి ఆపరేషన్ రావణ...కర్నాటకలో ఆపరేషన్ కుమార అని అన్నారు. అంతేకాదు ఈ ఆపరేషన్లో ఏయే పార్టీ ఎలా పని చేస్తుంది.. ఎలా జాతీయ పార్టీ వారితో పనిచేయించుకుంటుంది.. ఆఖరికి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు... అని కూడా శివాజీ చెప్పాడు.

 

అయితే శివాజీ చెప్పింది ఎంత వరకూ నిజమో... నిజంగా ఇదంతా జరుగుతుందో లేదో తెలియదు కానీ.. కొంత వరకూ మాత్రం శివాజీ మాటలు మాత్రం  ప్రజల్లోకి బలంగా వెళ్ళినట్టే తెలుస్తోంది. మరోవైపు... ఇంకో వాదన కూడా వినిపిస్తుంది. శివాజీ బీజేపీ కి మంచి స్ట్రోక్ అయితే ఇచ్చారు కానీ... అసలు ఈ ఈ ఆపరేషన్ కార్యరూపం దాల్చుతుందా అన్నది ప్రశ్నగా మిగిలింది. ఎందుకంటే... నిజానికి ఇప్పటికే ఈ ఆపరేషన్ గురించి శివాజీ బయటకు చెప్పేశాడు. మరి బయటకు చెప్పిన ప్లాన్ ను బీజేపీ అనుసరించే అవకాశమే లేదు. బహిర్గతం అయిన అంశాన్ని ఏ రాజకీయ పార్టీ కూడా అనుసరించదు. ఒకవేళ బీజేపీ కనుక ఈ ప్లాన్ అనుసరించపోతే ఓవిధంగా బిజెపికి ‘మాస్టర్ స్ట్రోక్’ను ఇవ్వడంలో శివాజీ సక్సెస్ సాధించాడని చెప్పవచ్చు. మరి ఏ రాజకీయ పార్టీ కూడా ఒక్క ప్లాన్ తోనే ఉండదు. రాజకీయ ఎత్తుగడలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మనం ఒకటి అనుకుంటే..ఇంకోటి జరుగుతుంది. ప్రస్తుతానికైతే బీజేపీ ప్లాన్ ఇదని బిజెపికి ‘మాస్టర్ స్ట్రోక్’ ఇచ్చాడు. మరి బీజేపీ ఇంకేం ప్లాన్ వేస్తుందో చూద్దాం...