మన్మోహన్‌ సింగ్‌ లాగానే మరో నాయకుడు వస్తాడు

 

కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని పార్టీలను కలుపుకొని పోవడమే కాకుండా.. అవసరమైతే ప్రధాని పదవి విషయంలో త్యాగానికి కూడా సిద్ధమైంది. ఇప్పటికే ఈ విషయంలో కాంగ్రెస్ పలుసార్లు స్పష్టత ఇచ్చింది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం.. 'రాహుల్‌ గాంధీయే యూపీఏ తరఫున ప్రధాని అభ్యర్థి అని కాంగ్రెస్‌ ఎన్నడూ చెప్పలేదని' అన్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన  నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శరద్‌ పవార్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.

ఆయన  తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. '2019 ఎన్నికల ఫలితాలు.. 2004 లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లాగే ఉంటాయి. ఆ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని నెలకొల్పేందుకు ఏ పార్టీకీ మెజార్టీ రాలేదు. అయినప్పటికీ, కాంగ్రెస్‌ తన మిత్రపక్షాలతో కలిసి 10 ఏళ్లు అధికారంలో ఉండగలిగింది. 2004లో వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఎన్నికలు జరిగాయి. అప్పట్లో ఆయనకు ప్రత్యామ్నాయంగా నిలిచే మరొక నాయకుడు ఎవరూలేరని బీజేపీ ప్రచారం చేసింది. ఆ పార్టీకి అప్పట్లో నాయకత్వం వహించిన వాజ్‌పేయిని, ఇప్పుడు నాయకత్వం వహిస్తున్న ప్రధాని మోదీని పోల్చిచూస్తే.. ఆ పార్టీలో అప్పుడు ఉన్నంత బలమైన నాయకుడు ఇప్పుడు లేరనే చెప్పాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు.. మోదీ వర్సెస్‌ ఎవరు? అన్న ప్రశ్నకు అంత ప్రాధాన్యం లేదని అన్నారు. ‘2004 లోక్‌సభ ఎన్నికల తర్వాత దేశ ప్రధానిగా మన్మోహన్‌ సింగ్‌ ఉంటారని ఎవరు ఊహించారు? ప్రతి సందర్భం ఓ వ్యక్తిని నాయకుడిగా నిలబెడుతుంది. రాజకీయాల్లో ప్రత్యామ్నాయ నాయకుడు ఎల్లప్పుడూ ఉంటారు’ అని అన్నారు. తమ‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీయే యూపీఏ తరఫున ప్రధాని అభ్యర్థి అని కాంగ్రెస్‌ ఎన్నడూ చెప్పలేదని నిన్న ఆ పార్టీ నేత చిదంబరం చేసిన వ్యాఖ్యతో ఏకీభవిస్తున్నానని, ప్రతిపక్షాల తరఫున ప్రధాని ఎవరన్న విషయాన్ని ఎన్నికల తరువాత నిర్ణయిస్తే బాగుంటుందని అన్నారు. ‘నేను రాహుల్‌ గాంధీతో పలుసార్లు మాట్లాడాను. నిన్న చిదంబరం చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగానే రాహుల్‌ ఉద్దేశం కూడా ఉంది’ అని శరద్‌ పవార్‌ వ్యాఖ్యానించారు.