వీర విధేయ విచిత్ర కాంగ్రెస్ నేతలు

Publish Date:Feb 1, 2014

Advertisement

 

రాష్ట్ర విభజన ప్రకటన చేసేవరకు కాంగ్రెస్ అధిష్టానాన్ని దూషిస్తూ, బెదిరిస్తూ అతికష్టం మీద రోజులు దొర్లించుకొచ్చిన టీ-కాంగ్రెస్ నేతలు, ఆ తరువాత సోనియా గాంధీ తెలంగాణా ప్రజల ఇంటి ఇలవేల్పని, ఆమె మాటంటే మాటే! అని ఆమెకు చెక్కభజన చేస్తూ తరిస్తున్నారు. ఒకవేళ పార్లమెంటులో తెలంగాణా బిల్లు ఆమోదించలేక, ఎన్నికలలోగా తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు చేయకపోతే అప్పుడు వారందరూ సోనియమ్మకు చెక్క భజన చేస్తారో లేక మళ్ళీ తిట్లు లంఖించుకొంటారో చూడాలి. వారందరూ ఇప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, సీమాంధ్ర కాంగ్రెస్ నేతలని నిందిస్తూ కాలక్షేపం చేస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డిని నిందించని టీ-కాంగ్రెస్ నేత లేడంటే అతిశయోక్తి కాదు. గత ఐదు నెలలుగా వారందరూ కూడా అతను ముఖ్యమంత్రిగా అనర్హుడని వెంటనే దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. అతని వల్లనే తెలంగాణా ఏర్పాటు ఆలస్యం అవుతోందని వాదిస్తారు. అధిష్టానానికి నిత్యం అతనిపై పిర్యాదులు చేస్తుంటారు. అయితే వారెవరూ కూడా అతని ప్రభుత్వానికి కూల్చే ప్రయత్నం మాత్రం చేయలేదు.

 

ఇక సీమాంధ్ర కాంగ్రెస్ నేతల పద్దతి మరీ విచిత్రంగా ఉంది. వారిలో కొందరు అధిష్టానానికి దిక్కరిస్తుంటే, మరి కొందరు ఆ విమర్శిస్తున్న వారితో మాటల యుద్ధం చేస్తుంటారు. అలాగని వారు తమ అధిష్టానం నిర్ణయం ప్రకారం రాష్ట్ర విభజనకు అంగీకరిస్తున్నామని చెప్పే సాహసం చేయలేరు. మొన్న రాజ్యసభ అభ్యర్ధుల చేత నామినేషన్లు వేయించడానికి ముఖ్యమంత్రి, దామోదర రాజనరసింహ, బొత్ససత్యనారాయణ ముగ్గురు చెట్టాపట్టాలు వేసుకొని తరలివెళ్లడం చూస్తే, కాంగ్రెస్ నేతలందరి డీ.యన్.ఏ. ఒకటేనని, అందరు అధిష్టానానికి విధేయులేనని అర్ధం అవుతుంది. పార్టీ నిలబెట్టిన అభ్యర్ధులను గెలిపించుకోవడానికి ముఖ్యమంత్రితో సహా సీమాంధ్ర నేతలందరూ కలిసి చేసిన కృషి చూస్తే వీరేనా అధిష్టానాన్ని దిక్కరిస్తోంది? అనే అనుమానం కలగక మానదు.

By
en-us Political News