కర్ణాటక బీజేపీలో మొదలైన లొల్లి.. ఎమ్మెల్యే అనుచరులపై లాఠీచార్జ్!!

 

కర్ణాటకలో జేడీఎస్- కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వానికి చెక్ పెట్టి.. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సీఎంగా యడియూరప్ప ప్రమాణస్వీకారం చేశారు. మంత్రివర్గం లేకుండా ఒంటరిగా మూడు వారాలు బండి లాక్కొచ్చారు. అయితే బీజేపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ తో.. ఎట్టకేలకు ఈరోజు మంత్రివర్గం ఏర్పాటు చేసుకున్నారు. 17 మంది మంత్రులుగా ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. అయితే అలా ప్రమాణస్వీకారం అయిందో లేదో అప్పుడే బీజేపీలో అసమ్మతి సెగ మొదలైంది. మంత్రి పదవులు దక్కని సీనియర్ ఎమ్మెల్యేలు అసమ్మతి గళం విప్పుతున్నారు. తమ నాయకులకు మంత్రి పదవులు దక్కలేదని అనేక నియోజక వర్గాల్లో బీజేపీ కార్యకర్తలు రోడ్ల మీదకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

కర్ణాటకలోని చిత్రదుర్గ నియోజక వర్గం ఎమ్మెల్యే జేహెచ్. తిప్పారెడ్డి మంత్రి పదవి రాలేదని తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా ఆయన దూరంగా ఉన్నారు. మంత్రిపదవి దక్కకపోవడంపై తిప్పారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వాజ్ పేయి, ఎల్ కే అద్వాణి, ప్రధాని మోడీ, అమిత్ షా తదితరులను ఆదర్శంగా తీసుకుని తాను రాజకీయాల్లో కొనసాగుతున్నానని తిప్పారెడ్డి అన్నారు. అయితే మంగళవారం విడుదలైన మంత్రివర్గం జాబితా చూసిన తరువాత తాను షాక్ కు గురయ్యానని తిప్పారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు తిప్పారెడ్డి అనుచరులు చిత్రదుర్గలోని గాంధీ సర్కిల్ లో ధర్నా నిర్వహించారు. బీజేపీ కోసం ఇంత కాలం నీతినిజాయితీగా పని చేసిన మా నాయకుడు తిప్పారెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బైక్ కు నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తల ఆందోళనతో చిత్రదుర్గలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు. అయితే పరిస్థితి విషమించడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు.