రేవంత్ అరెస్ట్..భార్య ఫిర్యాదు..కూతురు కామెంట్స్

 

రేవంత్ రెడ్డి అరెస్ట్ తో కొడంగల్ లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రేవంత్ అరెస్ట్ పై ఆయన భార్య గీత ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా రేవంత్ రెడ్డి అరెస్ట్‌పై కొడంగల్‌లో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి గీత ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి మూడు గంటలకు తమ ఇంట్లోని బెడ్రూమ్‌లోకి చొరబడి పోలీసులు దాడులు చేయడాన్ని, రేవంత్‌ను అరెస్ట్ చేయడాన్ని ప్రశ్నిస్తూ రిటర్నింగ్ అధికారికి లేఖ సమర్పించారు. కుటుంబసభ్యులతో పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని లేఖలో ప్రస్తావించారు. తన భర్తను ఏ వింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు?...ఎక్కడికి తీసుకువెళ్లారో చెప్పాలి అంటూ లేఖలో డిమాండ్ చేశారు. ఇన్ని గంటలైనా ఇప్పటి వరకు పోలీసులు సమాధానం చెప్పలేదని గీత ఆవేదన వ్యక్తం చేశారు.

టీఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి ఫాంహౌజ్‌లో గత నెల 27న అధికారులు దాడి చేసినప్పుడు భారీగా నగదు లభ్యమైనా అతని అభ్యర్థిత్వంపై చర్యలు తీసుకోకపోవడాన్ని రేవంత్ ప్రశ్నిస్తే, ఇంత వరకు చర్యలు తీసుకోలేదని ఆమె అన్నారు. అధికార యంత్రాంగం చర్యలను నిరసిస్తూ శాంతియుత నిరసనకు రేవంత్‌ పిలుపునిస్తే అర్ధరాత్రి అరెస్ట్ చేయడం ఏంటి అని లేఖలో ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు లేదా?..ప్రశ్నించే హక్కు లేదా? అని రిటర్నింగ్ అధికారిని గీత ప్రశ్నించారు. పోలీసులు తమ ఇంటి బెడ్రూమ్ తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి ప్రవేశించడం ఎంత వరకు సబబు అంటూ ఓ మహిళగా ఆలోచించాలి అని అధికారినికి విజ్ఞప్తి చేశారు. శాంతియుతంగానే తాము ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నామని తెలిపారు.

మరోవైపు రేవంత్‌ రెడ్డి అరెస్ట్‌పై ఆయన కూతురు నైమిషా రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తన తండ్రిని ఎక్కడ ఉంచారో చెప్పాలని డిమాండ్ చేశారు. అర్ధరాత్రి తమ ఇంటి తలుపులను బద్దలు కొట్టి బెడ్రూమ్‌లోకి వచ్చి తన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారని ఆమె తెలిపారు. ఒక టెర్రరిస్టును ఈడ్చుకెళ్లినట్లు తన తండ్రిని పోలీసులు తీసుకువెళ్లారని అన్నారు. తన తండ్రితో పాటు ఆయన సోదరులు, అనచురులు, ఇంట్లో పనిచేసే వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఎన్నికల ముందు భయానక వాతావరణాన్ని సృష్టించేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని విమర్శించారు. తన తండ్రిని అరెస్ట్ చేసేందుకు వచ్చిన వారు పోలీసులేనా అని ఆమె ప్రశ్నించారు. తన తండ్రిని ఎక్కడికి తీసుకెళ్లారో ప్రశ్నించే హక్కు తమకు ఉందని, తన తండ్రి ఎక్కడ ఉన్నారో చెప్పాలని నైమిషా రెడ్డి డిమాండ్ చేశారు.