పార్లమెంట్ కు రేవంత్ రెడ్డి..!!

 

అనతి కాలంలోనే రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు రేవంత్ రెడ్డి. కొడంగల్ నుంచి రెండు సార్లు అసెంబ్లీలో కి అడుగుపెట్టిన రేవంత్.. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. రేవంత్‌రెడ్డి ఓటమి కాంగ్రెస్‌కు పెద్ద షాక్‌ అనే చెప్పాలి. దీంతో క్రియాశీలక రాజకీయాల్లో చురుకుగా ఉండాలని భావిస్తున్న రేవంత్... అవకాశం వస్తే పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తితో ఉన్నారు. ఆయనతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్‌ సీనియర్లు లోక్‌సభ బరిలో తమ సత్తా చూపాలనే యోచనలో ఉన్నారు. ఫిబ్రవరి లేదా మార్చిలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ వస్తుందనే వార్తల నేపథ్యంలో తాము పోటీ చేయాలనుకుంటున్న లోక్‌సభ స్థానంలోని పరిస్థితులపై ఓ అంచనాకు వస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా ఓటమి పాలైన మాజీ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జీవన్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, డి.కె.అరుణ తదితరుల పేర్లు ఎంపీ అభ్యర్థుల జాబితాలో వినిపిస్తున్నాయి. నల్లగొండ అసెంబ్లీ నుంచి ఓటమిపాలైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ,మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానం నుంచి రేవంత్‌రెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం కాంగ్రెస్‌ వర్గాల్లో జరుగుతోంది. మహబూబ్‌నగర్‌ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్న కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి స్థానంలో రేవంత్‌కు అవకాశం ఇస్తారని, అవసరమైతే జైపాల్‌ను మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేయించే అవకాశం ఉందని సమాచారం. మల్కాజ్‌గిరి నుంచి డి.కె.అరుణ లేదంటే ఆమె కుమార్తె స్నిగ్ధారెడ్డి కూడా సీటు అడిగే అవకాశముంది.