ఎట్టకేలకు ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తేలిపోయింది

 

తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు గాను 16 స్థానాలకు రెండు విడతలుగా అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. ఖమ్మం లోక్‌సభ విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు వేసి ప్రకటన ఆలస్యం చేసింది. మొదట్లో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్‌నేత రేణుకా చౌదరి పేరు వినిపించినా తరువాత ఆమెకి టికెట్ కష్టమనే అభిప్రాయం వ్యక్తమైంది. మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు కాంగ్రెస్ తరపున ఖమ్మం బరిలో దిగుతారని వార్తలొచ్చాయి.. కానీ ఆయన అనూహ్యంగా టీఆర్ఎస్ లో చేరి టీఆర్ఎస్ తరపున బరిలోకి దిగారు. ఇక టీఆర్ఎస్ లో టికెట్ దక్కించుకోలేకపోయిన సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. కాంగ్రెస్ పెద్దలతో టచ్ లో ఉన్నారని, ఆయన కాంగ్రెస్ లో చేరి ఎంపీగా బరిలోకి దిగుతారని ప్రచారం జరిగింది. మరోవైపు మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, వ్యాపారవేత్త రవిచంద్ర వంటి వారి పేర్లు కూడా వినిపించాయి. అయితే వీటన్నింటికి చెక్ పెడుతూ.. తాజాగా కాంగ్రెస్ అధిష్ఠానం ఖమ్మం ఎంపీ అభ్యర్థిని ప్రకటించింది. రేణుకా చౌదరి వైపే అధిష్ఠానం మొగ్గుచూపింది. అన్ని విధాలుగా ఆలోచించిన తర్వాత రేణుకా అయితే మంచిదనే నిర్ణయానికి వచ్చిన అధిష్ఠానం.. ఆమె పేరును అధికారికంగా ప్రకటించింది.