తొలి లోక్‌పాల్‌గా జస్టిస్‌ ఘోష్‌ ప్రమాణస్వీకారం

 

భారత తొలి లోక్‌పాల్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ శనివారం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌.. జస్టిస్‌ ఘోష్‌ చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగొయ్ హాజరయ్యారు.

ఫిబ్రవరి నెలాఖరులోగా లోక్‌పాల్ నియామక ప్రక్రియ పూర్తిచేయాలంటూ సుప్రీంకోర్టు గడువు విధించడంతో... ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని సెలక్షన్ ప్యానెల్ ఇటీవల జస్టిస్ ఘోష్‌ను (66)ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. జస్టిస్ ఘోష్ 2017లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు.

కేంద్ర స్థాయిలో లోక్‌పాల్‌ను, రాష్ట్ర స్థాయిలో లోకాయుక్త నియామకానికి ఉద్దేశించిన లోక్‌పాల్‌, లోకాయుక్త చట్టం 2013లో ఆమోదం పొందింది. సిట్టింగ్‌ ఎంపీలు, కేంద్ర, రాష్ట్రాల మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులపై వచ్చే అవినీతి కేసులపై దర్యాప్తు చేసే అధికారం లోక్‌పాల్‌కు ఉంటుంది.