చంద్రబాబే టార్గెట్... వైసీపీ వ్యూహమిదే? 

ఒక్కొక్కడ్ని కాదు షేర్ ఖాన్... వంద మందిని ఒకేసారి పంపించనే సినీ డైలాగ్ మాదిరిగా... టీడీపీ చంద్రబాబు కూడా ఏపీ అసెంబ్లీలో పంచ్ డైలాగ్ లు పేల్చారు. యాభై మంది కాదు... నూటా యాభై మంది ఒకేసారి వచ్చినా ఎదుర్కొగల శక్తి సామర్ధ్యాలు... సమాధానం చెప్పగల దమ్ము తనకుందంటూ అధికార పార్టీపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఈ మాట ఎందుకన్నారంటే... ఏపీ శాసనసభలో చంద్రబాబు టార్గెట్ గా అధికారపక్షం గేమ్ ఆడుతోంది. చంద్రబాబు మానసిక స్థైర్యాన్ని మనో బలాన్ని దెబ్బతీసేందుకు... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొదలుకొని... కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే వరకూ అందరూ బాబే టార్గెట్ గా విరుచుకుపడుతున్నారు. సందర్భమైనా, అసందర్భమైనా ఏ అంశంలోనైనా చంద్రబాబును కార్నర్ చేస్తూ వ్యక్తిగత దూషణులకు దిగుతున్నారు. దాంతో, చంద్రబాబు ఎంతగా మనో నిబ్బరం ప్రదర్శించినా... వైసీపీ ఎమ్మెల్యేల మాటల తాలుకూ ప్రభావం టీడీపీ అధినేత ముఖంలో కనిపిస్తూనే ఉంటుంది. ప్రజల కోసమే అవమానాలన్నీ భరిస్తున్నానని చంద్రబాబు అంటుంటారు. అసెంబ్లీలో సీన్ చూస్తే నిజమే అనిపిస్తుంది.

చంద్రబాబు...లేదంటే లోకేష్‌. అధికార వైసీపీ టార్గెట్ ఈ ఇద్దరే. అందుకే, టాపిక్‌ ఏదైనా, ఇద్దర్నీ టార్గెట్ చేస్తున్నారు. సీఎం జగన్ మొదలుకొని... పలువురు మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు... చంద్రబాబుపై పర్సనల్ అటాక్ చేస్తున్నారు. కొడాలి నాని, అనిల్ కుమార్, బొత్స, బుగ్గన, పేర్ని నాని, కన్నబాబు తదితర మంత్రులు... బాబు అండ్ లోకేషే టార్గెట్ గా మాటల తూటాలు పేల్చుతున్నారు. చంద్రబాబును తిట్టడంలో పోటీ పెట్టినట్టుగా మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు నిప్పులు చెరుగుతున్నారు. అయితే, బాబుని ఈవిధంగా టార్గెట్ చేయడం వెనుక రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. టీడీపీకి చంద్రబాబే బలం. ఆ బలాన్నే దెబ్బకొడితే మొత్తం పార్టీనే దెబ్బతీయొచ్చన్న వ్యూహంతోనే బాబుపై పర్సనల్ అటాక్ కి దిగుతున్నారని అంటున్నారు. బాబునే సైలెంట్ చేస్తే, ఇక మిగతా నేతలందరూ నోరు మూసుకుంటారనే స్ట్రాటజీని అమలు చేస్తున్నారు.

ఇక, బాబు వయసు పైబడటంతో, భవిష్యత్ నాయకుడిగా భావిస్తున్న లోకేష్ ను టార్గెట్ చేయడం ద్వారా, అతని ఆత్మస్థైర్యం దెబ్బతీసి టీడీపీకి భవిష్యత్తే లేదనే చర్చను తెలుగుదేశం కేడర్ లోకి, అలాగే ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నదే వైసీపీ వ్యూహమని చెబుతున్నారు. మొత్తానికి బాబు అండ్ లోకేష్ ను టార్గెట్ చేయడం వెనుక... తెలుగుదేశంలో సంక్షోభం తేవడమే లక్ష్యమంటున్నారు. అయితే, గతంలో పదేళ్లపాటు గడ్డుపరిస్థితులను ఎదుర్కొన్నా తన పోరాట పటిమతో 2014లో తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన చంద్రబాబు... ఒంటరి పోరాటంచేసైనాసరే ఈ క్లిష్ట పరిస్థితి నుంచి తెలుగుదేశాన్ని గట్టెక్కిస్తారని టీడీపీ కేడర్ భావిస్తోంది. ఇక, చంద్రబాబు కూడా తనపై జరుగుతోన్న పర్సనల్ అటాక్ ను... ప్రజల్లో సానుభూతిగా మలుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి, భవిష్యత్తులో ఏం జరగనుందో చూడాలి.