రామోజీ, కోమటిరెడ్డి భేటీ... కొత్త పార్టీ..!

 

తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన అంశాలు చోటుచేసుకుంటున్నాయి. మొన్నటి వరకూ కోదండరామ్ కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. ఇక కోదండరామ్  కూడా పార్టీ పెట్టమని ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. అయితే ఇప్పుడు తాజాగా కోమటిరెడ్డి బ్రదర్స్ వార్తల్లోకి ఎక్కారు. త్వరలో కొత్త పార్టీ పెట్టే యోచనలో వీరు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. గత కొంత కాలంగా వీరు కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహంతో ఉన్నారు. దీనికి కారణం... తెలంగాణలో కేసీఆర్ ను ఢీకొనగలిగే సామర్థ్యం ఉన్న తమను కాదని ఉత్తమ్ కుమార్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవిని కట్టబెట్టడమే. దీనికి తోడు ఇటీవల రేవంత్ రెడ్డి కూడా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరడం... పార్టీ కూడా రేవంత్ కు తగిన గుర్తింపును ఇవ్వాలనే యోచనలో ఉండటంతో వారికి తగిన ప్రాధాన్యత దక్కడం లేదన్న కోపంతో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో వీరి అడుగులు కొత్త పార్టీ ఏర్పాటు చేసే దిశగా పడుతున్నాయని చెబుతున్నారు. ఇంకా ఆయన రామోజీరావుతో భేటీ అవ్వడంతో ఈ వార్తలు నిజమేనేమో అని అంటున్నాయి రాజకీయ వర్గాలు. రామోజీరావును కలిసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి దాదాపు అరగంట సేపు ఆయనతో చర్చలు జరిపారు. రామోజీ ఆశీస్సులు కావాలని కోరారట. కాంగ్రెస్ లో కొనసాగాలా? వద్దా? అనే సలహాను కూడా రామోజీ నుంచి తీసుకున్నారట. తన భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి సూచనలను కోరారట. అంతేకాదు కొత్త పార్టీ పెడితే, ఒకవేళ 2019లో తెలంగాణలో హంగ్ వస్తే, తాము చక్రం తిప్పవచ్చనే ఆలోచనలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారట. మరి ఇందులో ఎంత నిజముందో.. నిజంగానే కొత్త పార్టీ పెడతారో..? లేదో..? తెలియాలంటే కొంత సమయం ఆగాల్సిందే మరి.