రైల్వే బడ్జెట్ నిరాశ కలిగించింది... అయితే...

 

కేంద్ర ప్రభుత్వం గురువారం నాడు వెల్లడించిన రైల్వే బడ్జెట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు నిరాశ కలిగించింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు రెండు రాష్ట్రాలకూ ఏవైనా వరాలు ప్రకటిస్తారేమోనని ప్రజలు ఎదురుచూశారు. అయితే రెండు రాష్ట్రాలకూ ఆయన ఎలాంటి వరాలూ ఇవ్వలేదు. గతంలో వున్న చిన్న చిన్న వరాలకు కొద్దికొద్దిగా కేటాయింపులు చేశారు. అయితే ఈ రైల్వే బడ్జెట్ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో ఆశలు పెట్టుకుంది. కేంద్రం రైల్వే పరంగా ఏపీని ముందుకు తీసుకెళ్తుందని ఆశించింది. అయితే రైల్వే బడ్జెట్ మాత్రం ప్రస్తుతం కష్టాల్లో ఉన్న ఏపీకి కొంతయినా ఊరట కలిగించేలా లేదు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఒక రాష్ట్రానికి ఏవైనా వరాలు ఇచ్చి మరో రాష్ట్రానికి ఏమీ ఇవ్వకపోతే లేనిపోని తలనొప్పి అనుకున్నారో ఏమోగానీ, రెండు రాష్ట్రాలకూ మొండిచెయ్యి చూపించారు. అయితే ఈ బడ్జెట్ పట్ల ప్రజలు తమ నిరాశను బాహాటంగా వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నాయకులు మాత్రం తమ ఆవేదనను మాటల్లో బయటపెట్టలేకపోతున్నారు. ఇటు ఏపీలో అధికారంలో వున్న తెలుగుదేశం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి మిత్రపక్షం. తెలంగాణలో వున్న టీఆర్ఎస్ కేంద్రంతో సత్సంబంధాలను పెట్టుకోవాలని ఆశిస్తున్న పార్టీ. అందుకే ఈ రెండూ పెద్దగా స్పందించడం లేదు.

 

అయితే, ఇప్పుడు రెండు రాష్ట్రాలకు ఎలాంటి వరాలు ఇవ్వాలని నిరాశలో కూరుకుపోవలసిన అవసరం లేదు. ఈసారి రైల్వే బడ్జెట్‌లో వడ్డింపులు లేవు కాబట్టి వరాలు కూడా లేకుండా పోయాయి. పైగా ఇది ఎన్డీయే ప్రభుత్వ మొదటి బడ్జెట్ కాబట్టి మనం పెద్దగా ఆగ్రహించాల్సిన అవసరం కూడా లేదని చెప్పొచ్చు. గత పదేళ్ళుగా కాంగ్రెస్ పార్టీ చేసిన కంగాళీని సరిదిద్దడంలోనే మొదటి ఏడాది పుణ్యకాలం పూర్తవుతుంది. ఆ తర్వాత మోడీ మ్యాజిక్‌ కారణంగా మంచి ఫలితాలు వస్తే రాష్ట్రాలకూ అన్ని విధాలుగా మేలు జరిగే అవకాశం వుందని ఆశావాదంతో వుండాలి. గత పదేళ్ళుగా రాష్ట్రాలు నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం చుట్టూ ప్రదక్షిణలు చేసేవి. తాజాగా కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 32 నుంచి 42 శాతానికి పెంచి మోడీ రాష్ట్రాల నెత్తిన పాలు పోశారు. ఇది ఎవరూ ఊహించని వరం. ఊహించని వరాలు ఇచ్చిన మోడీ, రైల్వే బడ్జెట్ విషయంలో మాత్రం ఊహించిన వరాలు ఇవ్వలేదు. ఇవ్వగలిగితే అడక్కుండానే ఇచ్చేవారన్న సూత్రాన్ని మననం చేసుకుంటూ రెండు తెలుగు రాష్ట్రాలూ ఒక ఏడాదిపాటు ఓర్పు వహించడమే మంచిదన్న అభిప్రాయాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.