అంబానీ, నీరవ్‌ మోదీలను సోదరులారా అని పిలుస్తారు

 

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీహార్ లోని పూర్ణియాలో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ చాలా హామీలు ఇచ్చారు. కానీ, వాటిల్లో ఏవీ అమలు చేయలేదు అని విమర్శించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే మేము కనీస ఆదాయ భరోసాను ఇస్తామన్నారు. నేను ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతున్నాను. మధ్యప్రదేశ్‌, ఛత్తీసగఢ్‌లో రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చాను.. దాన్ని అమలు చేశాము అని గుర్తుచేశారు. 'ఎన్డీఏ ప్రభుత్వం.. నీరవ్‌ మోదీ, అనిల్‌ అంబానీ వంటి వారికి డబ్బులు ఇచ్చింది. మేము మాత్రం రైతులకు, కూలీలకు ఇస్తాం. చాలా మంది పారిశ్రామికవేత్తలకు చెందిన రుణాలను మోదీ మాఫీ చేశారు. కానీ, రైతు రుణమాఫీ మాత్రం చేయలేదు’ అని రాహుల్ వ్యాఖ్యానించారు.

మోదీ చౌకీదార్‌ (కాపలాదారుడు)గా ఉంటున్నది పేదవారికి కాదని, ధనవంతులకేనని విమర్శించారు. హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌కు రాఫెల్ డీల్ దక్కకుండా చేసి, ఆ ఒప్పందాన్ని రక్షణ రంగంలో ఎటువంటి అనుభవం లేని అనిల్‌ అంబానీకి ఇచ్చారని.. ఆయనకే మోదీ చౌకీదార్‌గా పనిచేస్తున్నారని విమర్శించారు. చాలా మంది ఆర్థిక నేరస్తులు దేశం నుంచి తప్పించుకుని పారిపోయారు. ఇటువంటి ఘటనలను మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా ఎన్నాళ్లు చూడాలి? అని ప్రశ్నించారు. భావజాలాలకు సంబంధించిన పోరాటం జరుగుతోంది. మనకు రెండు రకాల భావజాలాలు ఉన్న భారత్‌ అవసరం లేదు. అందరిని కలుపుకుని అభివృద్ధి చెందే వ్యవస్థను మేము తీసుకొస్తాం అన్నారు. 'దేశాన్ని ధనవంతుల వర్గం, పేదవారి వర్గంగా విడగొట్టాలని మోదీ ప్రయత్నిస్తున్నారు. సాధారణ ప్రజలను మోదీ మిత్రులారా అని పిలుస్తారు. కానీ, అనిల్‌ అంబానీ, నీరవ్‌ మోదీలాంటి వారిని మాత్రం సోదరులారా అని పిలుస్తారు’ అని రాహుల్‌ ఆరోపించారు.