తెలంగాణా బరిలో రాహుల్?

 

 

కాంగ్రెస్ యువరాజు రాహుల్‌ గాంధీ తెలంగాణాలో పోటీ చేయబోతున్నారు. ఇందుకోసం తెలంగాణాలో టీఆర్‌ఎస్ బలహీనంగా, కాంగ్రెస్ బలంగా ఉన్న స్థానాలేమున్నాయి, రాహుల్ పోటీ చేస్తే తెలంగాణా అంతటా దాని ప్రభావం పడే అవకాశముందా అనే ప్రశ్నలకు ఏఐసీసీ వేగులు సమాధానాలు వెదుకుతున్నారు. కచ్చితంగా గెలిచే అవకాశమున్న పార్లమెంట్ స్థానం ఏదనే దానిపై అభిప్రాయాలను సేకరిస్తున్నారు. తెలంగాణా బిల్లును పార్లమెంట్‌లో ఆమోదింపజేయడంతో ఇక్కడ కాంగ్రెస్‌కు ప్రజాదరణ పెరిగిందని పలు సర్వేలు వెల్లడించడంతో రాహుల్‌ గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని కాంగ్రెస్ వర్గాలు పరిశీలిస్తున్నాయి. తాను పోటీ చేయడం ద్వారా తెలంగాణాలోని అన్ని సీట్లపైనా దాని ప్రభావం ఉంటుందని, తద్వారా మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవచ్చనే ఉద్దేశంతోనే ఈ అంశంపై యువరాజు కూడా దృష్టి సారించినట్టు తెలిసింది. అందుకే తన వేగులను పంపి తెలంగాణాలో కాంగ్రెస్ పరిస్థితి, కచ్చితంగా గెలిచే అవకాశాలున్న సీట్లు, టీఆర్‌ఎస్ బలంపై ఆరా తీయిస్తున్నారు. దక్షిణ తెలంగాణాలో టీఆర్‌ఎస్ బలం తక్కువగా ఉన్నందున, పోటీకి ఈ ప్రాంతమే మేలనే భావనకు వచ్చిన వేగులు, చేవెళ్ల, భువనగిరి, నల్లగొండ నియోజకవర్గాలను పరిగణనలోకి తీసుకున్నట్టు తెలిసింది. ఈ అంశంపై ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యులతో వారు ఫోన్లో మాట్లాడి, అగ్రనేతలకు ఆయా సీట్లు ఎంతవరకు సురక్షితం అనే అంశాన్ని విశ్లేషించినట్టు తెలిసింది. రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలతో కూడా రాహుల్ దూతలు మంతనాలు జరిపినట్టు సమాచారం.