వీళ్ళు అభ్యుదయ రైతులా? ద్యేవ్‌డా!



అసలు అభ్యుదయ రైతులు అంటే ఎవరు? తమ పొలంలో వ్యవసాయం చేసి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదురొడ్డి, మంచి ఫలసాయం సాధించి దేశాభివృద్ధికి సహకరిస్తూ, ఇతర రైతులకు ఆదర్శంగా నిలిచిన వారిని అభ్యుదయ రైతులు అంటారు. మన తెలంగాణ రాష్ట్రంలో అలాంటి అభ్యుదయ రైతులకు కొదువే లేదు. నీరు, విద్యుత్, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, పనివాళ్ళు... ఇలాంటి సమస్యలు ఎన్ని వున్నా, ఆ సమస్యలను సవాళ్ళుగా తీసుకుని భూముల్లో బంగారం పండిస్తున్న రైతన్నలు ఎంతోమంది వున్నారు. భూమిని అమ్మేస్తే లక్షలకు లక్షలు వచ్చే అవకాశం వున్నా... నేల తల్లినే నమ్ముకుని, నలుగురికీ పట్టెడన్నం పెట్టాలన్న సదుద్దేశంతో వున్న ఆదర్శ రైతులు, అభ్యుదయ రైతులు ఎంతోమంది వున్నారు. మరి విదేశాలకు మన తరఫున అభ్యుదయ రైతులుగా పంపించాలంటే ఎవర్ని పంపించాలి... ఇలాంటి వారినే పంపించాలి. కానీ, తెలంగాణ ప్రభుత్వం అందుకు వ్యతిరేకమైన పని చేసింది. అది ఇప్పుడు వివాదాస్పదమైంది. నలుగురూ నవ్వుకునే టాపిక్‌లా మారింది.  ఆదర్శ రైతులంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేల పుత్రరత్నాలేనన్న అర్థం వచ్చేలా ప్రభుత్వం ఆదర్శ రైతులను ఎంపిక చేసింది. ఇలాంటి వ్యవహారాల్లో కొత్త తరహా ‘ఆదర్శానికి’ తెర తీసింది.

ఇజ్రాయిల్ దేశంలో ఈనెల 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఒక అంతర్జాతీయ స్థాయి వ్యవసాయ ఎగ్జిబిషన్ జరగబోతోంది. ఈ ప్రదర్శనకు మీ రాష్ట్రంలోని ఆదర్శ రైతులను పంపించాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆహ్వానం అందింది. దాంతో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో ఇజ్రాయిల్ వెళ్ళడానికి ఒక ‘అభ్యుదయ రైతు’ ప్రతినిధి బృందం సిద్ధమైపోయింది. ఈ ప్రతినిధి బృందంలో ఎవరెవరు ఉన్నారయ్యా అంటే... ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్లు, పలువురు అధికారులతోపాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, గంగుల కమలాకర్, దాసరి మనోహర్ రెడ్డి వున్నారు. వీరితోపాటు కొంతమంది అధికార పార్టీ ఎమ్మెల్యేల పుత్రరత్నాలు కూడా వీరితోపాటు ఇజ్రాయిల్‌కి వెళ్ళబోతున్నారని వార్తలు వస్తున్నాయి. వ్యవసాయవిశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు, అధికారుల వరకు ఓకే.. కానీ, ‘అభ్యుదయ రైతులు’ అనే హోదాలో వెళ్ళబోతున్న అధికార పార్టీ నాయకులను చూసి చాలామంది ముక్కున వేలేసుకుంటున్నారు.

ఇజ్రాయిల్ ప్రభుత్వం అభ్యుదయ రైతుల్ని పంపమంటే ఎమ్మెల్యేలను పంపడమేంటన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఎమ్మెల్యేలు కాకుండా తెలంగాణ రాష్ట్రంలో అసలు అభ్యుదయ రైతులే లేరా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఎమ్మెల్యేలు ఇజ్రాయిల్‌కి టూర్‌ వెళ్ళాలని ముచ్చట పడుతూ వుంటే ఓకే... వారితోపాటు ఒకరిద్దరు నిజమైన ఆదర్శ  రైతులను పంపొచ్చుకదా అని అంటున్నారు.  ప్రభుత్వం ఇప్పటికైనా ఇజ్రాయిల్‌కి పంపే ప్రతినిధి బృందంలో సభ్యుల విషయంలో తన నిర్ణయాన్ని పునః పరిశీలించుకోవాలని పలువురు సూచిస్తున్నారు. ఒకవేళ తెలంగాణ మొత్తంలో అభ్యుదయ రైతులు ఎవరూ అందుబాటులో లేకపోతే, ఎకరానికి కోట్ల రూపాయల పంట పండిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అయినా ఈ ప్రతినిధి బృందంతో ఇజ్రాయిల్‌కి వెళ్ళొచ్చుకదా అంటున్నారు.