ప్రియాంక గాంధీ ఫస్ట్ షో.. గ్రాండ్ సక్సెస్

 

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, తూర్పు యూపీ ఇన్‌చార్జ్‌ హోదాలో ప్రియాంక గాంధీ తొలిసారిగా లక్నోలో భారీ రోడ్‌షోలో పాల్గొన్నారు. సోమవారం మధ్యాహ్నం లక్నో చేరుకున్న ప్రియాంక.. సోదరుడు, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో కలిసి రోడ్‌ షోలో పాల్గొన్నారు. ఈ రోడ్‌షోలో పార్టీ పశ్చిమ యూపీ ఇన్‌చార్జ్‌ జ్యోతిరాదిత్య సింధియా, ఇతర కాంగ్రెస్‌ నేతలు కూడా పాల్గొన్నారు. నగరంలోని అమౌసి ఎయిర్‌పోర్టు నుంచి కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయం వరకు సాగిన రోడ్‌ షోలో ప్రియాంక, రాహుల్‌ బస్సుపైన నిలబడి.. కార్యకర్తలు, అభిమానులకూ అభివాదం చేస్తూ ముందుకుసాగారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీ లక్నోలో చేపట్టిన తొలి ర్యాలీ కావడంతో పెద్దసంఖ్యలో పార్టీ శ్రేణులు, మద్దతుదారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. ఉత్తర్‌ ప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకూ విశ్రమించమని అన్నారు. ప్రియాంక గాంధీ యూపీలోనే ఉంటారని స్పష్టం చేసిన రాహుల్‌.. రాష్ట్రంలో నిజాయితీతో కూడిన ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. మన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏర్పాటే మన లక్ష్యమని స్పష్టం చేశారు. భారత్‌కు గుండెకాయ వంటి యూపీలో పార్టీ బలోపేతం కోసం ప్రియాంక గాంధీ, జ్యోతిరాదిత్య సింధియాలను తాను ప్రధాన కార్యదర్శులుగా నియమించానని రాహుల్‌ చెప్పారు.

రాబోయే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అత్యధిక స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో పార్టీ బాధ్యతలు ప్రియాంకకు అప్పగించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె పరిధిలో ఉన్న 40 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ కంచుకోటలుగా చెప్పుకొనే స్థానాలున్నాయి. వాటిలో ప్రధాని నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఎంపీగా పనిచేసిన గోరఖ్‌పూర్‌ సీట్లు కీలకమైనవి. వీటిపై ప్రియాంక ప్రత్యేక దృష్టిపెట్టనున్నారు. మొత్తానికి ప్రియాంక లేట్ గా అయినా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అవుతున్నారు. తాజాగా ఆమె ట్విట్టర్ లో కూడా అడుగుపెట్టారు. ఈరోజు ఆమె అధికారికంగా ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమె అలా ఎంట్రీ ఇచ్చారో లేదో కొద్ది గంటల్లోనే దాదాపు లక్ష మంది ఫాలోయర్స్ వచ్చారు. దీన్నిబట్టి అర్ధం చేసుకోవచ్చు ప్రియాంక క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో. మరి కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నట్లు ప్రియాంక క్రేజ్ ఆ పార్టీకి ఏ మేరకు ఉపయోగపడుతుందో చూడాలి.