విజయవాడ దుర్గమ్మ గుడిలో కరోనాతో అర్చకుడి మృతి

దేశ వ్యాప్తంగా సామాన్యులను విఐపిలను కూడా కరోనా చుట్టేస్తోంది. ఇప్పటికే తిరుమల శ్రీవారి ఆలయంలోని పలువురు అర్చకులు, సిబ్బందికి కరోనా రావడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా విజయవాడ కనకదుర్గ గుడి ఆలయంలోని సిబ్బంది, ఉన్నతాధికారులకు కూడా కరోనా సోకడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా దుర్గ గుడి ఈవో సురేష్ బాబుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అదే విధంగా ఆలయంలో మరో 18 మంది సిబ్బంది కరోనా బారిన పడ్డారు. ఐతే ఆలయంలో విధులు నిర్వహిస్తున్న అర్చకుడు రామకృష్ణ ఘనాపాటి కరోనా కారణంగా నిన్న కన్ను మూశారు. మూడు రోజుల క్రితం ఆయనకు కరోనా సోకినట్టు ఆలయ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆయన భార్య కూడా ఆస్పత్రిలో కరోనాకు చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా ప్రస్తుతం ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. దీంతో కరోనా నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని ఆలయ కమిటీ నిర్ణయించింది.

 

ఇది ఇలా ఉండగా కరోనా కారణంగా నిన్న టీటీడీ అర్చకుడు శ్రీనివాసాచార్యులు కన్నుమూయడంతో తిరుమలలోని అర్చకులు విషాదంలో మునిగిపోయారు. దీంతో విధులు నిర్వహించేందుకు అర్చకుల్లో చాలామంది జంకుతున్నారు. శ్రీనివాసాచార్యులు చనిపోయారనే సంగతి తెలిసిన వెంటనే పలువురు అర్చకులు గోవింద నిలయంలో సమావేశమయ్యారు. తిరుమల ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రితో ఈ విషయం పై అర్చకుల చర్చలు జరిపారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో కళ్యాణోత్సవ సేవను ఈ నెల 31వరకు నిలిపి వేయాలని అర్చకుల ఆయనకు సూచించినట్టు తెలుస్తోంది.