మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రఫుల్ పటేల్ ఎదురుకున్న షాక్.......

 

వాస్తవానికి దావూద్ గ్యాంగ్ బినామీ ఆస్తులు చాలా రోజుల క్రితమే బయటపడ్డాయి. కానీ డీ గ్యాంగ్ తో లింకున్న నేతల పేర్లు మాత్రం ఇప్పుడే బయటకొచ్చాయి. ప్రఫుల్ పటేల్ కు మిలీనియం డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ ఉంది. ప్రఫుల్ తో పాటు ఆయన భార్య వర్ష ఇందులో భాగస్వాములు, ముంబైలో విలాసవంతమైన ఏరియాలో దావూద్ కుడి భుజం ఇక్బాల్ మిర్చికి వందల కోట్ల విలువైన స్థలముంది. రెండు వేల

ఏడులో మిలీనియం డెవలపర్స్ కు మిర్చి కుటుంబానికి మధ్య డీల్ కుదిరింది. ఇక్బాల్ మిర్చికి చెందిన స్థలంలో ప్రఫుల్ పటేల్ సంస్థ సీజే హౌస్ అని ఖరీదైన అపార్ట్ మెంట్ ను నిర్మించింది. అందులో రెండు ఫ్లోర్ లను ప్రతిఫలంగా ఇక్బాల్ మిర్చి కుటుంబానికి కేటాయించారు. ఈ ఒప్పందానికి సంబంధించిన డాక్యుమెంట్ లలో ప్రఫుల్ పటేల్ స్వయంగా సంతకం చేశారు. అదే పత్రాలపై ఇక్బాల్ మిర్చి భార్య హజరా కూడా సంతకాలు చేశారు. రెండు వేల ఏడు నాటి డాక్యుమెంట్ లను ఈడీ సంపాదించింది. ఈ ఆస్తులు ఎలా వచ్చాయన్న విషయం పై ఇక్బాల్ మిర్చి కుటుంబ సభ్యులను ఈడీ ఇప్పటికే ప్రశ్నించింది. వాళ్ళను ప్రశ్నించినప్పుడు ప్రఫుల్ పటేల్ పేరు బయటకు వచ్చింది.

అయితే రెండు వేల ఏడు నాటి విషయాలను ఇప్పుడు ఎందుకు తెరపైకి తెచ్చారని ప్రశ్నిస్తున్నారు ప్రఫుల్ పటేల్. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కేవలం కొద్ది రోజుల ముందు రాజకీయ లబ్ధి పొందటానికి ఈ కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. కావాలనే డాక్యుమెంట్ లను మీడియాకు ఈడీ లీక్ చేసిందని మండిపడ్డారు. ఇక్బాల్ మిర్చితో తాను ఎలాంటి ల్యాండ్ డీల్ చేయలేదంటున్నారు ప్రఫుల్ పటేల్. రెండు వేల ఏడులో ఈ డీల్ కుదిరినప్పుడు ఇక్బాల్ మిర్చి భార్య హజరా పై ఎలాంటి కేసులు లేవన్నారు. అంతా చట్టపరంగానే జరిగిందన్నారు.

హజ్రా విధిగానే ఆదాయపు పన్ను చెల్లించారని కూడా తెలిపారు. తనపై కేసులో వెనుక రాజకీయ కుట్ర ఉందని అంటున్నారు ప్రఫుల్ పటేల్. కోర్టులోనే తేల్చుకుంటానని ఆయన స్పష్టం చేశారు. ఈడీ విచారణకు ఈ నెల పధ్ధెనిమిది వ తేదీన హాజరవుతానని తెలిపారు ప్రఫుల్ పటేల్. పోలింగ్ కు కేవలం ఐదు రోజుల ముందు ఆయనకు ఈడీ పిలుపు రావడం తీవ్ర కలకలం రేపింది. ప్రఫుల్ పటేల్ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు అత్యంత సన్నిహితుడు.

మన్మోహన్ కేబినెట్ లో ఆయన విమానయాన శాఖ నిర్వహించారు. ఎయిర్ బస్ కుంభకోణంలో ఆయన్ను ఇప్పటికే సీబీఐ ఈడీ అధికారులు విచారించారు. తాజాగా దావూద్ గ్యాంగ్ తో బిజినెస్ డీల్స్ లో ఆయన చిక్కుకోవడం ఎన్సిపికి పెద్ద దెబ్బగా మారింది.ఇక ఈ టేన్షన్ నుంచి ప్రఫుల్ పటేల్ ఎలా బయటపడతారో వేచి చూడాలి.