లచ్చన్న పార్లమెంటుకే.. నెగ్గిన కోడలి పంతం

 

 

 

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఈసారి లోక్‌ సభకే పోటీ పడుతున్నట్లు తెలిసింది. కోడలు వైశాలి గట్టిగా పట్టుబట్టడంతో తప్పని పరిస్థితుల్లో జనగాం అసెంబ్లీ టికెట్ ఆమెకే ఇప్పించి, తాను నల్లగొండ జిల్లా భువనగిరి నుంచి లోక్ సభకు వెళ్లాలని పొన్నాల భావిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అభ్యంతరం వ్యక్తం చేస్తే తప్ప పొన్నాల పేరు దాదాపుగా ఖరారైనట్లేనని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, సిట్టింగ్ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పరిస్థితి ఏమిటనేది ఆసక్తికరంగా మారింది.పొన్నాల ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న జనగాం అసెంబ్లీ స్థానం నియోజకవర్గ పునర్విభజనలో కొత్తగా ఏర్పడిన భువనగిరి పార్లమెంట్ పరిధిలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పొన్నాల ఇక్కడి నుంచే ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

 

టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈసారి కూడా హుజూర్‌ నగర్ నుంచే పోటీ చేయనున్నారు.ఆయన సతీమణి పద్మావతిని కోదాడ నుంచి పోటీ చేయించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కుందూరు జానారెడ్డి నాగార్జునసాగర్ నుంచి పోటీ చేయనుండగా.. ఆయన తనయుడు కె.రఘువీర్‌రెడ్డిని మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి బరిలో దింపనున్నారు.