రివర్స్‌తో రిస్కే.... జగన్ సర్కారుకు దెబ్బ మీద దెబ్బ

 

జగన్ ఆలోచనలకు, వైసీపీ ప్రభుత్వం తీసుకుంటోన్న నిర్ణయాలకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. టీడీపీని కార్నర్ చేయాలనో... లేక చంద్రబాబును ఇరకాటంలో పెట్టాలనో... తెలియదు కానీ జగన్ తీసుకుంటోన్న నిర్ణయాలను అటు కేంద్రం... ఇటు ప్రజలు తప్పుబడుతున్నా... తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్న మాదిరిగా జగన్ ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తోంది. ముఖ్యంగా నవ్యాంధ్ర జీవనాడైన పోలవరంపై జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికే కేంద్రం తప్పుబట్టగా, ఇఫ్పుడు స్వయంగా పోలవరం అథారిటీయే షాకిచ్చింది.

పోలవరం టెండర్ల రద్దు నిర్ణయం అత్యంత బాధాకరమంటూ, పార్లమెంట్ సాక్షిగా కేంద్ర జలవనరులశాఖామంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రివర్స్ టెండరింగ్ తో ప్రాజెక్టు వ్యయం పెరగడంతోపాటు ఇది ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమంటూ దాదాపు చేతులెత్తేశారు. సేమ్ టు సేమ్ ఇలాంటి కామెంట్సే చేసింది పోలవరం అథారిటీ. కొత్తగా టెండర్లు పిలవడం వల్ల కాలాతీతమవుతుందని, వ్యయం భారీగా పెరుగుతుందని, చివరికి పోలవరం భవిష్యత్తే ప్రశ్నార్థకమవుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

పోలవరం టెండర్ల రద్దు, ప్రీ-క్లోజర్ పై నాలుగైదు గంటలపాటు సుదీర్ఘంగా చర్చించిన అథారిటీ... రివర్స్ టెండరింగ్ తో రిస్కేనని తేల్చిచెప్పింది. ప్రస్తుత కాంట్రాక్టు సంస్థల పనితీరు సంతృప్తికరంగానే ఉందని, అలాంటప్పుడు టెండర్లు రద్దు చేయడం ఎందుకుని అభిప్రాయపడింది. ఏదేమైనా రివర్స్ టెండరింగ్ కు వెళ్లడం సరికాదన్న పోలవరం అథారిటీ... పునరాలోచించుకోవాలంటూ జగన్ సర్కారు సూచించింది. అయితే, తుది నిర్ణయం మాత్రం ప్రభుత్వానిదేనని స్పష్టంచేసింది. మొత్తానికి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోలవరం అథారిటీ వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశంతోపాటు సంచలనంగా మారింది. మరి పోలవరం అథారిటీ కామెంట్స్ పై జగన్ సర్కారు ఎలా స్పందిస్తుందో చూడాలి.