ముఖ్యమంత్రులకి పవన్ కళ్యాణ్ హితబోధ

ఒక రాష్ట్రం విడిపోయిన తర్వాత సమస్యలు తప్పక వస్తాయని, అటువంటి సమయంలో ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు సంయమనంతో వ్యవహరించాలని జనసేన రథసారథి పవన్‌ కల్యాణ్‌ హితవు చెప్పారు. రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రులూ ఇకనుంచైనా జాగ్రత్తగా వ్యవహరించకపోతే అంతర్యుద్ధం వచ్చే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రులూ పరస్పర విమర్శలు మానుకుని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు.

 

హైదరాబాద్‌ రాజధాని కాబట్టే సీమాంధ్ర ప్రజలు ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారని చెబుతూ ఆంధ్రోళ్లు, సెటిలర్లు అనే మాటలు ఉపయోగించవద్దని ఆయన తెలంగాణ నాయకులకు హితవు చెప్పారు. చంద్రబాబును తిట్టాలంటే తిన్నగా తిట్టండి, తెలుగుదేశం పార్టీని తిట్టాలంటే తిన్నగా తిట్టండి, నన్ను తిట్టాలంటే తిన్నగా తిట్టండి అంతేగాని ఆంధ్రోళ్లు అని తిట్టవద్దని ఆయన కోరారు. ఆంధ్ర అంటే ఒక జాతి అని వివరిస్తూ వారిలో మాలలు ఉన్నారు, మాదిగలు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు... ఇలా అందరూ ఉన్నారని, ఆంధ్రోళ్లు అంతా తెలుగుదేశం పార్టీలో లేరని ఆయన గుర్తు చేశారు. తనను ఎవరైనా విమర్శించవచ్చునన ఆయన అన్నారు.

 

యాదాద్రిలో విజయనగరానికి చెందిన వ్యక్తిని చీఫ్‌ ఆర్కిటెక్ట్‌గా నియమించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలుగుజాతి ఐక్యతకి అడుగు వేశారా అని ఈరోజు పత్రికలు చూస్తుంటే అనిపించిందని ఆయన కితాబు ఇచ్చారు. ఇది చాలా మంచి పరిణామం అని ఆయన ప్రశంసించారు. రాష్ట్ర విభజనకు యుపిఏ, ఎన్డీయే రెండూ బాధ్యులే అంటూ తెలంగాణకు మంచి జరిగింది, మంచిదే, కాని ఆంధ్రప్రదేశ్‌కు నష్టం జరిగిందని ఆయన అన్నారు. సోమవారం సాయంత్రం పవన్‌ కల్యాణ్‌ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడుతూ విభజన సమస్యలు పరిష్కరించకపోతే శ్రీలంక తరహా సమస్యలు తలెత్తుతాయని పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారు.

 

విభజన సమయంలో తెలంగాణ ఎంపీలు పనిచేసినట్టు ఆంధ్ర ఎంపీలు పనిచేయలేదని ఆయన ఆక్షేపించారు. అందుకు కారణం వారు వ్యాపారవేత్తలు కావడమేనని ఆయన వివరించారు. మీ రాష్ట్రంకోసం మీరు పనిచేయవలసింది పోయి మీ వ్యాపారాలకోసమే పనిచేసుకుంటే ఆంధ్రకు ఎక్కువ అన్యాయం చేసేది మీరే అవుతారని కూడా ఆయన హెచ్చరించారు. మీకు పనిచేయడం చేతకాకపోతే రాజకీయాలలో ఉండకండి అని కూడా ఆయన హితవు చెప్పారు.