చంద్రబాబు 2014 లో కాంగ్రెస్ తో కలవాల్సింది: పవన్

 

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై దాడి జరగడం దురదృష్టకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. విజయవాడ నుంచి తుని వరకు పవన్ రైలు యాత్ర చేపట్టిన విషయం తెల్సిందే. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్.. జగన్ పై దాడిని ప్రతీ ఒక్కరూ ఖండించాలన్నారు. దాడి ఘటనపై ప్రభుత్వం వెకిలిగా మాట్లాడటం తగదని హితవు పలికారు. జగన్ పై దాడి ఘటనను లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉందన్నారు. నిందితుడు శ్రీనివాస్ దాడి కావాలని చేశాడా?.. వేరేవారెవరైనా చేయించారా?.. ఏదైనా కుట్ర దాగి ఉందా?.. అనేది పోలీసులు విచారణలో తేలాల్సి ఉందన్నారు. రాజకీయ జోక్యం లేకుండా విచారణ జరిపి వాస్తవాలు బయటకు తేవాలని డిమాండ్ చేశారు. జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిలలు దాడి చేయించారని టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యల్ని పవన్ ఖండించారు. ఎక్కడైనా తల్లి కొడుకుపై దాడి చేయిస్తుందా అంటూ నిలదీశారు.

అదేవిధంగా టీడీపీ, కాంగ్రెస్ దోస్తీ గురించి కూడా పవన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. టీడీపీ, కాంగ్రెస్ ల పొత్తు చంద్రబాబు అధికార దాహానికి నిదర్శనమని విమర్శించారు. ఇరు పార్టీల కలయిక రాజకీయ ఉనికి కోసమేనని చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారం వల్లే సమీకరణాలు మారతాయే తప్ప పార్టీల కలయికల వల్ల కాదన్నారు. ఢిల్లీలో చంద్రబాబు చూపించింది సినిమా విడుదలకు ముందు వచ్చే ట్రైలర్ లాంటిదన్నారు. కానీ చంద్రబాబు సినిమా ప్లాప్ అవ్వడం ఖాయమన్నారు. చంద్రబాబు కాంగ్రెస్ తో కలయిక చూస్తుంటే ఆయన ఎక్కడ మెుదలయ్యారో అక్కడికే చేరుకున్నట్లు ఉందన్నారు. చంద్రబాబు ఈ నిర్ణయం 2014లో తీసుకోవాల్సిందని.. పార్టీలతో పెట్టుకోవాల్సింది పొత్తు కాదని ప్రత్యేక హోదా కోసం బలమైన పోరాటం చెయ్యాలని సూచించారు. అన్నయ్య చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ తాను 2014 లో టీడీపీకి మద్దతు ఇచ్చానని గుర్తుచేశారు. అలాంటి కాంగ్రెస్ తో టీడీపీ ఎలా కలుస్తుందని నిలదీశారు. తాను ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు యాత్రలు చేస్తున్నానే తప్ప అధికారం కోసం కాదన్నారు.