ఒక్క రోజు గడువిస్తున్నా...మీ ఇష్టం..

 

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో ఏ చిన్నపిల్లాడిని అడిగినా చెబుతాడు. శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ దగ్గర మొదలైన రచ్చ.. అటు పోయి ఇటు పోయి అఖరికి జనసేన అధినేత పవన్ దగ్గరకి వచ్చి ఆగింది. శ్రీరెడ్డి పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం.. దాని సూత్రధారి రాం గోపాల్ వర్మ అని బయటకు రావడం.. వర్మ కూడా పవన్ ని అలా తిట్టమని శ్రీరెడ్డికి చెప్పింది నేనే అని చెప్పడం.. మరోవైపు వైసీపీ పేరు కూడా వినిపించడం అబ్బో ఒక ట్విస్టా.. రెండు ట్విస్ట్ లా.. ఒకదాని తరువాత ఒకటి వస్తూనే ఉన్నాయి.

 

ఇక పవన్ ను అంత మాట అన్నందుకు పవన్ అభిమానులు అయితే ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇక పవన్ కూడా దీనిపై స్పందించి రాష్ట్ర ప్రభుత్వంపై, మీడియా ఛానల్స్ పై విరుచుకుపడ్డారు. తనపై కుట్ర జరుగుతోందని.. తన తల్లిని దారుణంగా అవమానిస్తారా? అంటూ తీవ్ర ఆగ్రహంతో ట్వీట్ల మీద ట్వీట్లు చేశారు. అంతేకాదు తన తల్లి గురించి అంత మాట అన్నందుకు చర్యలు తీసుకోవాలంటూ ఆయన ఈ రోజు ఉదయం నుంచి ఫిలిం ఛాంబర్ వద్దకు వచ్చారు. పవన్ కు తోడుగా మెగా ఫ్యామిలీ తో పాటు అల్లు ఫ్యామిలీ.. ఇంకా పలువురు సినీ ప్రముఖులు కూడా ఫిలిం ఛాంబర్ కు వెళ్లారు. ఇక పవన్ ఫిలిం ఛాంబర్ కు వచ్చారని తెలియడంతో మెగా అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు. పవన్ కు మద్దతుగా నిలిచారు. ఉదయం నుంచి నినాదాలు ఇస్తున్న పవన్ అభిమానులు.. మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో తమ నినాదాల హోరును పెంచారు. ఫిలిం ఛాంబర్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. వారిని  పోలీసులు అతి కష్టమ్మీద నిలువరించారు. మధ్యాహ్నం 2.15 గంటల సమయంలో ఫిలిం ఛాంబర్ నుంచి బయటకు వచ్చిన పవన్.. తన క్యారవాన్ లో ఉండిపోయారు. అనంతరం వెళ్లిపోయారు.

 

అయితే దాదాపు ఐదు గంటలు ఫిలింఛాంబర్ లో ఉన్న పవన్... తన తల్లిని అవమానించేలా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. దానికి తమకు ఒకరోజు గడువు ఇవ్వాలని ఫిలింఛాంబర్ సభ్యలు కోరగా... దానికి పవన్ ఏకీభించినట్లుగా తెలుస్తుంది. ఒకవేళ.. ఒక్కరోజు వ్యవధిలో నిర్ణయం తీసుకోకుంటే తన కార్యాచరణను ప్రకటిస్తానని స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు. మరి  చూద్దాం ఏం జరుగుతుందో..