పవన్‌కి ఇన్నాళ్ళకి తెల్లారింది

 

పవన్ కళ్యాణ్‌కి పార్టీ పెట్టిన ఇన్నాళ్ళకి తెల్లారినట్టుంది. పార్టీ నిర్వహణ పరంగా ఇంతకాలం మొద్దు నిద్ర పోయిన ఆయన ఇప్పుడిప్పుడే నిద్రలేచి మెల్లగా ఆవలిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తన మనసులో వున్న రాజకీయపరమైన కోరికలు బయటపెట్టి చాలా సంవత్సరాలు అవుతోంది. అప్పటి నుంచి ఆయన జనసేన పార్టీలో ఏక్ నిరంజన్‌లాగా కొనసాగుతున్నారు. మధ్యలో ఇతరుల పేర్లు రెండు మూడు వినిపించినప్పటికీ ఆ తర్వాత వాళ్ళు సైడైపోయారు. పవన్ కళ్యాణ్ మళ్లీ తానే కర్త, కర్మ, క్రియలాగా పార్టీని కొనసాగించారు. పార్టీలో మరో నాయకుడనేవాడు లేకుండా అన్నీ తానే అన్నట్టుగా ఇంతకాలం వ్యవహరించారు. పార్టీ అనేది ఒక్కరితో నడవదు. పార్టీ మాత్రమే కాదు.. సినిమా అనేది కూడా ఒక్కరితో నడవదు. ఇన్ని సినిమాల్లో యాక్ట్ చేసిన పవన్ కళ్యాణ్ సినిమాల్లో మాత్రం చాలామంది చేత వర్క్ చేయిస్తున్నారు. పార్టీ విషయానికి వస్తే మాత్రం అన్నీ తానై నడుపుతూ వచ్చారు. ఏదైనా సినిమాకి హీరో దగ్గర్నుంచి లైట్ బోయ్ వరకూ అన్ని శాఖలూ ఒకే వ్యక్తి నిర్వహిస్తే ఎంత ఎటకారంగా వుంటుందో పవన్ కళ్యాణ్ పార్టీ నిర్వహణ కూడా అంతే ఎటకారంగా తయారైంది. జనసేన మీద ఇప్పటి వరకూ ప్రజల్లో సరైన అభిప్రాయం కలగకపోవడానికి ప్రధాన కారణం ఆ పార్టీలో సంస్థాగత నిర్మాణం ఎంతమాత్రం లేకపోవడమే. తాను తప్ప మరొకరు పార్టీ తరఫున లైమ్‌లైట్‌లోకి రాకుండా చేయడం అనేది పవన్ కళ్యాణ్ చేసిన తప్పిదాలలో ఒకటని రాజకీయ పరిశీలకులు ఎప్పటినుంచో చెబుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి పార్టీ పెట్టానని చెప్పే పవన్ కళ్యాణ్ తన పార్టీలోనే ప్రజాస్వామ్యాన్ని అమలు చేయడం లేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. పార్టీ కోసం స్క్రిప్ట్ రైటర్ల కోసం వెతికే శ్రద్ధ పార్టీలో కార్యకర్తలు, నాయకులను పెంచుకునే అంశం మీద పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టకపోవడం వింతగా అనిపిస్తోందని పలువురు అభిప్రాయపడుతూ వచ్చారు.

 

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే పనిలో పడ్డారు. నూతన సంవత్సరం ముందు రోజున పార్టీ కార్యకర్తల ఎంపిక ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఉరుములేని పిడుగులా పవన్ కళ్యాణ్‌కి పార్టీని బలోపేతం చేయాలన్న ఉత్సాహం రజనీకాంత్ కారణంగానే వచ్చిందని పరిశీలకులు భావిస్తున్నారు. అవతల తమిళనాడులో ఎప్పటి నుంచో రాజకీయాల్లోకి వస్తాను... రాను అంటూ ఊరించిన రజనీకాంత్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి దూకేశారు. సహజంగానే జనాల్లో పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ ఫాలోయింగ్ వున్న రజనీకాంత్‌ రాజకీయ ప్రవేశ ప్రకటన రాజకీయాల్లో సంచలనం కలిగించింది. రజనీకాంత్‌కి రాజకీయంగా సడెన్‌గా ఆకర్షణ పెరిగిపోయింది. రజనీ పార్టీ ఈసారి ఎన్నికలలో అధికారంలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా వున్నాయన్న లెక్కలు కూడా బయటకి వచ్చేశాయి. అయితే రజనీ రాజకీయ రంగ ప్రవేశం విషయంలో ఇంత పాజిటివ్ రియాక్షన్ వచ్చింది... తాను నడుపుతున్న రాజకీయాలకు మాత్రం అంత రేంజ్‌లో పాజిటివ్ రియాక్షన్ రాలేదేంటా అని పవన్ కళ్యాణ్ ఆలోచనలో పడిపోయినట్టు సమాచారం. పొరుగు రాష్ట్రంలో స్టార్ పార్టీ ప్రకటించగానే ఇంత పొలిటికల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. తాను మాత్రం ఇంతకాలంగా దేకుతున్నా అంత క్రేజ్ అంతగా రాకపోవడం పవన్ కళ్యాణ్ ఫీలయ్యే విషయమే కదా... అందుకే పక్క రాష్ట్రం రాజకీయాలను చూసి ఉత్సాహం తెచ్చుకుని తాను కూడా పొలిటికల్‌గా ఒక కీలకమైన స్టెప్ వేశారు. పోనీలెండి.. ఇప్పటికైనా కార్యకర్తల నమోదు ప్రారంభించారు.. సంతోషం.