సెక్షన్:8 కి నేను వ్యతిరేకం: పవన్ కళ్యాణ్

 

పవన్ కళ్యాణ్మీడియాతో మాట్లాడుతూ ‘నేను సెక్షన్: 8 అమలుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. అది కేవలం ప్రజల మధ్య అల్లర్లు చెలరేగినప్పుడు లేదా నగరంలో అశాంతి నెలకొన్నప్పుడే ఉపయోగిస్తారని నేను అభిప్రాయపడుతున్నాను. తెలంగాణా ఉద్యమాల కోసం అనేక దశాబ్దాలుగా ఉద్యమాలు జరిగాయి. ప్రజలు నానా కష్టాలు పడ్డారు. ఇప్పుడు మళ్ళీ ప్రశాంతంగా ఉన్న నగరంలో సెక్షన్: 8ని అమలుచేయాలని ప్రయత్నిస్తే మళ్ళీ సమస్యలు మొదలవుతాయి. సెక్షన్: 8 అమలు ఏ వ్యక్తినో కాపాడటానికి ఏర్పాటు చేసింది కాదని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గ్రహించాలి. అదే విధంగా నగరంలో ప్రజలకు భరోసా ఇవ్వవలసిన బాధ్యత తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ దే. కానీ తెదేపాతోనో లేక చంద్రబాబు నాయుడినో తిట్టాలనే ఉద్దేశ్యంతో ‘ఆంధ్రోళ్లు’ ‘సెటిలర్స్’ వంటి పదాలను వాడుతున్నారు. దాని వలన రాష్ట్రప్రజలందరి హృదయాలను గాయపరుస్తున్నామనే విషయం మరిచి పోతున్నారు. ప్రజలందరినీ సమాన దృష్టితో చూస్తానని హామీ చేసిన ముఖ్యమంత్రి పక్షపాత వైఖరితో వ్యవహరించడం తగదు. ముందుగా ముఖ్యమంత్రులిరువురూ సక్యతగా వ్యవహరించ గలిగితే అప్పుడు ప్రజల మధ్య కూడా సక్యత ఏర్పడుతుంది,” అని అన్నారు.