నేడే మోడీ - పవన్ భేటీ

 

జనసేన పేరుతో పార్టీ పెట్టినట్లు ప్రకటించి, ఇటు టీడీపీ.. అటు బీజేపీ రెండింటితోనూ పొత్తు పెట్టుకుంటున్నపవన్ కల్యాణ్.. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని కలుస్తున్నారు. శుక్రవారం నాడు మోడీని కలిసేందుకు ఏర్పాట్లన్నీ పూర్తిచేసుకుని గురువారం సాయంత్రమే అహ్మదాబాద్ వెళ్లారు. శుక్రవారం సాయంత్రం పవన్ - మోడీల భేటీ జరిగే అవకాశం ఉంది.

 

వాస్తవానికి వీళ్లిద్దరి సమావేశం గురించి ముందు ఉంటుందని, తర్వాత ఉండదని, మళ్లీ ఉంటుందని రకరకాల వార్తలు మీడియాలో హల్ చల్ చేశాయి. పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు కూడా మోడీని పవన్ కలవట్లేదని అన్నారు. మళ్లీ చివరకు కలుస్తున్నట్లు జనసేన వర్గాలు చెప్పాయి.

 

మోడీతో భేటీ సందర్భంగా రాజకీయాలతోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల అభివృద్ధిపై తనకున్న ఆలోచలను పవన్ పంచుకోనున్నారు. ఆయన మద్దతు కోరనున్నారు. ఎన్నికల అనంతరం బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే 'తెలుగు జాతి' అభివృద్ధికి ఏం చేయాలి? ఎలాంటి ప్రణాళికలు అమలు చేయాలి? తదితర అంశాలపై తన ఆలోచనలు చెప్పడంతోపాటు, మోడీ అభిప్రాయాలు కూడా పవన్ కల్యాణ్ తెలుసుకుంటారని తెలిసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభివృద్ధితో పాటు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనపై బీజేపీ వ్యూహాలు తెలుసుకోవాలని చూస్తున్నారు. రైతు ఆత్మహత్యలు, మహిళలపై అఘాయిత్యాలు గుజరాత్‌లో చాలా తక్కువ. ఇందుకు మోడీ అనుసరిస్తున్న విధానాలను కూడా పవన్ తెలుసుకునే అవకాశముంది. మోడీతో సమావేశం తర్వాత పవన్ తన పర్యటన వివరాలు బహిరంగ పరిచే అవకాశం ఉన్నట్లు తెలిసింది.