ప్రజాభిప్రాయానికి అద్దం పట్టిన పవన్ కళ్యాణ్ ప్రసంగం

 

మళ్ళీ చాలా రోజుల తరువాత నిన్న మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన పవన్ కళ్యాణ్ ‘చాలా బాధ్యతగానే’ మాట్లాడారని చెప్పవచ్చును. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, వాటి ముఖ్యమంత్రులు సఖ్యతగా మెలుగుతూ రెండు రాష్ట్రాల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని హితవు పలికారు. పార్టీల, వ్యక్తుల మధ్య ఉన్న విభేదాల కారణంగా ప్రజలు కొట్టుకొనే పరిస్థితి కల్పించవద్దని హితవు చెప్పారు. ఓటుకి నోటు కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది కనుక దానిపై మాట్లాడలేనని చెపుతూనే అందుకు దారి తీసిన కారణాల గురించి మాట్లాడారు. ఇతర పార్టీలకు చెందిన ఎమ్మేల్యేలను తెరాసలోకి ఆకర్షించడం వలననే ఈ సమస్యకు బీజం పడిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరును ఆయన ప్రస్తావించారు. ఆయనను తెరాసలోకి ఆకర్షించినా సనత్ నగర్ నియోజక వర్గంలో ఆంధ్రా ప్రజలను తెరాస వైపు తిప్పుకోగలరా? అని సూటిగా ప్రశ్నించారు.

 

రాష్ట్రాబివ్రుద్ధి చేయకుండా, ప్రజాసమస్యలను పరిష్కరించకుండా రాజకీయంగా ఒకరిపై మరొకరు పైచేయి సాధించుకొనే ప్రయత్నంలో ఇటువంటి సమస్యలు సృష్టించుకొంటూ కోర్టులు, కేసులు, విచారణలు అంటూ రెండు ప్రభుత్వాలు కాలక్షేపం చేయడాన్ని ఆయన ఆక్షేపించారు. వారిలాగే కొనసాగితే ప్రజలే వారికి తగిన గుణపాఠం చెపుతారని హెచ్చరించారు. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రాజకీయాలు మరీ ఇంత నీచస్థాయికి దిగజార్చితే దాని వలన పాలకులే కాదు ప్రజలు కూడా నష్టపోతారని హెచ్చరించారు. ఈ వ్యవహారంలో సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేసారు.

 

‘ఆంధ్రా’ అనే పదం ఏ ఒక్క వ్యక్తికో, రాజకీయ పార్టీకో చెందినది కాదని, అన్ని కులాలు, మతాలు వర్గాలతో కూడిన కోట్లాది ఆంద్ర ప్రజలను సూచించే పదమని కనుక అటువంటి పదప్రయోగం మానుకోమని కేసీఆర్, హరీష్ రావులకి ఆయన హితవు పలికారు. ఇక సెక్షన్: 8ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఉమ్మడి రాజధానిలో ప్రస్తుతం పరిస్థితులు ప్రశాంతంగానే ఉన్నాయని, కనుక సెక్షన్: 8 అమలు చేయనవసరం లేదని అభిప్రాయపడ్డారు. కానీ ప్రజలందరినీ సమాన దృష్టితో చూస్తూ వారి రక్షణకి భరోసా కల్పించాల్సిన బాధ్యత మాత్రం తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని ఆయన అన్నారు.

 

హైదరాబాద్ నగరాన్ని అందరూ కలిసి అభివృద్ధి చేసుకొన్నప్పటికీ, రాష్ట్ర విభజనలో అది తెలంగాణకు వెళ్ళింది కనుక దానిపై తమకు హక్కులున్నాయని ఆంద్రప్రదేశ్ నేతలు వాదించడం సబబు కాదని అన్నారు. కానీ ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు కనుక మరో 9 ఏళ్లపాటు హైదరాబాద్ నుండి పరిపాలించుకొనే అవకాశం కూడా ఉంది కనుక అంతవరకు వారికి ఇబ్బందులు సృష్టించకుండా సహకరించవలసిందిగా ఆయన తెలంగాణా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. హైదరాబాద్ తెలంగాణా రాష్ట్రానికి రాజధాని అయినప్పటికీ అది దేశంలో అంతర్భాగామనే విషయం తెలంగాణా ప్రభుత్వం గుర్తుంచుకోవాలని హితవు పలికారు.

 

రాష్ట్ర విభజన కారణంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రం చాలా నష్టపోయిందని దానిని ఆదుకోవలసిన బాధ్యత పూర్తిగా కేంద్రానిదేనని, అలాగే కాంగ్రెస్, బీజేపీలు కలిసి రాష్ట్ర విభజన చేసాయి కనుక ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కూడా వాటిదేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమస్యల పరిష్కారానికి ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేసారు.

 

మీడియా స్వేచ్చను హరించడాన్నిఆయన తీవ్రంగా తప్పు పట్టారు.మాజీ ప్రధాని ఇందిరాగాంధీఅంతటి వ్యక్తి ఎమర్జన్సీ సమయంలో మీడియా స్వేచ్చను హరించాలని ప్రయత్నించి విఫలమయ్యారనే సంగతి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తుంచుకోవాలని ఆయన హితవు పలికారు.  

 

ఆంద్రప్రదేశ్ యంపీలని ఆయన తీవ్రంగా విమర్శించారు. వారికి తమ వ్యాపారాలపై ఉన్న శ్రద్ధ రాష్ట్రానికి రావలసిన ప్రత్యేక హోదా తదితర అంశాల గురించి పార్లమెంటులో మాట్లాడేందుకు కనబడటం లేదని విమర్శించారు. ఒకవేళ వారికీ కేంద్రాన్ని నిలదీయడానికి భయంగా ఉంటే తక్షణమే తమ పదవులకు రాజీనామా చేసి తప్పుకోవాలని అప్పుడు ప్రజలే ఏమి చేయాలో నిర్ణయించుకొంటారని అన్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలన్నీ ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించాయని చెప్పవచ్చును. కానీ రాష్ట్రపతి అంతటి పెద్దమనిషి చెప్పినా వినిపించుకోని రాజకీయ పార్టీలు పవన్ కళ్యాణ్ వచ్చి హెచ్చరిస్తే మారిపోతాయనుకోవడం ఒట్టి భ్రమే.