గాడి తప్పిన పాక్ లో… ఓ గాడిద బతుకు!

 

మన దేశంలో జరిగే బోలెడు ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికలు, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుంటాయి. మధ్యలో అవిశ్వాస తీర్మానం పేరున లోక్ సభలోనూ ఓటింగ్ హడావిడి నడిచింది. వీటన్నటి మధ్యా అంతర్జాతీయ వ్యవహారాలు పెద్దగా ఆసక్తి లేని వారు పట్టించుకోకుండా వదిలేస్తోన్న ఎలక్షన్స్ త్వరలో జరగబోతున్నాయి. అవే పాకిస్తాన్ జాతీయ ఎన్నికలు! ఈ మాట వినగానే భారతీయులు ఎవరైనా నవ్వేసి ఊరుకునే ప్రమాదమే వుంది. అలాంటి స్థితి మన పక్క దేశంలో నెలకొని వుంటుంది. 1947లొనే స్వతంత్రం పొంది ఇండియాతో పాటూ ఏర్పడ్డప్పటికీ పాకిస్తాన్ దారుణమైన స్థితిలో వుంది. ఇండియా చంద్రుడ్ని, అంగారకుడ్ని చేరుకుంటూ వుంటే పాకిస్తాన్ కాశ్మీర్ లో కాలుపెట్టడానికి ఉగ్రవాదుల్ని తయారు చేయటంలోనే మునిగిపోయింది. దీనికి కారణం పాక్ లోని మతోన్మాదం, ఆ మతోన్మాదాన్ని వాడుకునే అక్కడి మిలటరీ. పాక్ సైన్యం చేతిలోనే ఆ దేశం అధికారం మగ్గిపోతూ వుంటుంది. ప్రధాని వున్నా, నియంతలు పాలించినా! అందుకే, పాక్ ఎన్నికలు అంటే ఎవ్వరూ పెద్దగా ఆసక్తి చూపరు…

 

పాకిస్తాన్ ఎన్నికల్ని మనం పెద్దగా పట్టించుకోకున్నా ఈ మద్య జరిగిన ఒక నికృష్టమైన దాడిని మాత్రం తప్పక మాట్లాడుకోవాలి. ఎన్నికల సందర్భంగా దాడి అంటే అదేదో మానవ బాంబు దాడి అనుకోకండి. అవి కూడా పాకిస్తాన్ లో సర్వ సాధారణం అయిపోయాయి. ఈ ఎన్నికల సందర్భంగానే బాంబు పేలుళ్లలో వందల మంది చనిపోయారు. అది పక్కన పెడితే కొందరు ఆగంతకులు కరాచీ నగరంలో ఓ రాత్రి పూట ఒక గాడిదని చిత్రవధ చేశారు. ఎంత దారుణంగా అంటే… గాడిద ముక్కుపుటాలు విరిచేశారు. ఎముకలు విరిగేలా చావబాదారు. కార్ తో గాడిదని ఢీకొట్టి నుజ్జునుజ్జు చేశారు! ఎందుకు? సమాధానం వింటే పాకిస్తాన్ లో రాజ్యమేలుతోన్న ఉన్మాదం ఎంతో అవగాహనకు వస్తుంది!

 

 

పాకిస్తాన్ ఎన్నికల్లో తరువాతి ప్రధానిగా మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఫుల్ గా ప్రచారం అవుతున్నాడు. అతడికే మిలటరీ సపోర్ట్ కూడా వుండటంతో గెలవటం దాదాపు ఖాయం అయిపోయినట్టే. అతను ప్రధాని అవుతాడో కాడోగానీ… ఇమ్రాన్ ఖాన్ ఓ మాటన్నాడు. ఎన్నికల ప్రచారంలో నవాజ్ షరీఫ్ మద్దతుదారులు గాడిదలు అన్నాడు! అదే గుర్తుతెలియని ఉన్మాదుల నికృష్ట ప్రవర్తనకి కారణం! రాత్రి వేళ ఘారాతి ఘోరంగా గాడిదని హింసించి దాని ఒంటిపై నవాజ్ అని కత్తితో చెక్కి… రోడ్డు పక్కన చావటానికి వదిలేసి వెళ్లిపోయారు.

 

బహుశా ఇమ్రాన్ ఖాన్ పార్టీ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ సభ్యులని అనుమానిస్తున్న సాడిస్టులు ఇంత వరకూ దొరకలేదు. మనుషుల్నే కుక్కల్లా కాల్చి చంపే పాకిస్తాన్ లో గాడిదని ఎవరు పట్టించుకుంటారు? అలా దారిన పోతున్న ఒకాయన రక్తం కక్కుతూ చచ్చిపోతున్న గాడిదని చూసి ఫేస్బుక్ లో పోస్టు పెట్టి ఎవరైనా సాయం చేయండని అభ్యర్థించాడు. ఒక స్వచ్ఛంద సంస్థ వారొచ్చి గాడిదకి ఫస్ట్ ఎయిడ్ చేసి ప్రస్తుతం వైద్యం చేయిస్తున్నారు. సగటు పాకిస్తానీల ఉన్మాదానికి బలైన ఆ గాడిద ఇంకా లేచి నిలబడి తిరగలేకపోతోంది. బతికే చాన్స్ వుందని వైద్యులు కూడా చెప్పలేకపోతున్నారు!

 

మనుషుల్నే మతోన్మాదంతో , డబ్బుల కోసం, అధికారం కోసం, అర్థంపర్థం లేని పగతో చంపేసే పాకిస్తాన్ లో గాడిద బతికినా చచ్చినా పెద్దగా తేడా ఏం వుండబోదు. కానీ, అసలు విషాదం ఏంటంటే… పాక్ లోని ఆర్మీ, పాలకులు, తాజాగా అధికారులు, న్యాయ వ్యవస్థలోని వారు అందరూ … మొత్తం వ్యవస్థనే గాడిదని చేశారు. తమకు ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చిన దిశ నుంచీ హింసిస్తున్నారు. అటువంటి పాక్ లో సామాన్య జనం బతుకులు మాత్రం… ఎన్ని ఎన్నికలు వచ్చినా …. చావుబతుకుల మధ్య ఊగిసలాడుతున్న ఆ గాడిదలానే వుండబోతున్నాయి. నవాజ్ షరీఫ్ జైలుకి వెళ్లినా, ఇమ్రాన్ ఖాన్ ప్రధాని అయినా పాక్ ఎప్పుడు మారుతుందో వాళ్ల దేవుడికే తెలియాలి!