ఎన్టీఆర్‌కు బిగ్ బాస్… బిగ్ లాసా..?

 

తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ రామకృష్ణ. ఆయన సీనియర్ ఎన్టీఆర్ కి, జూనియర్ కి కూడా అభిమాని. అయితే, ఆయన తాజా స్టేట్మెంట్ ప్రకారం తారక్ బిగ్ బాస్ షో హోస్ట్ చేయకపోవటం మంచిదట! బిగ్ బాస్ షో చేయటం వల్ల జూనియర్ ఇమేజ్ పాడవుతుందని రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. అంతే కాదు, ఎన్టీఆర్ కంటే ముందు చాలా మంది టాలీవుడ్ అగ్రహీరోల్ని బిగ్ బాస్ షో నిర్వాహకులు అప్రోచ్ కూడా అయ్యారట. వారెవరూ ఒప్పుకోకపోవటానికి కారణం… బిగ్ బాస్ షో వివాదాలమయం కావటమే!

 

ఇంతకీ బిగ్ బాస్ వల్ల నిజంగా ఎన్టీఆర్ కి ప్రమాదం పొంచి వుందా? ఈ ప్రశ్నకి సమాధానం ఇంచుమించూ అవుననే చెప్పుకోవాలి! తెలుగులో బిగ్ బాస్ షో ఇంకా మొదలు కానప్పటికీ అటు హిందీ, ఇటు తమిళ వర్షన్ల గోల చూస్తుంటే మనకు బిగ్ సంగతేంటో తెలిసిపోతుంది! అసలు కొందరు రకరకాల బ్యాక్ గ్రౌండ్స్ వున్న సెలబ్రిటీల్ని ఒక్కచోటకి చేర్చి… బయటకి వెళ్లకుండా చేసి… వాళ్లకి రకరకాల టాస్క్ లు ఇచ్చి విజేత ఎంపిక చేయటం బిగ్ బాస్ షో ఫార్మాట్! ఇది మన ఇండియాలో పుట్టిన ఐడియా కాదు. విదేశాల్లో టెలివిజన్ ఎంటర్టైన్మెంట్ ను కొత్త పుంతలు తొక్కించటానికి చేసిన ప్రయోగం. అక్కడ బాగా వర్కవుట్ అయింది. దాంతో ఇక్కడికి కూడా పార్సిల్ అయింది. కాకపోతే, పారిన్ లోనూ బిగ్ బ్రదర్ లాంటి షోలు ఎప్పుడూ వివాదాల్లోనే మగ్గుతుంటాయి. అలా లండన్ వెళ్లి బిగ్ బ్రదర్ షోలో పాల్గొన్న మన శిల్ప శెట్టి రాత్రికి రాత్రి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఆమె మీద మరో బ్రిటన్ నటి జాతి వివక్ష ప్రదర్శించటంతో శిల్పా శెట్టి అందరి దృష్టిలో పడింది! అప్పట్లో అదొ పెద్ద దుమారం!

 

ఇక హిందీలో సల్మాన్ హోస్ట్ చేసే బిగ్ బాస్ కూడా మామూలు రచ్చేం కాదు. చాలా సీజన్స్ నుంచీ నడుస్తోన్న హిందీ బిగ్ బాస్ ప్రతీ సంవత్సరం కొత్త తలనొప్పులు సృష్టిస్తూనే వుంటుంది. కొన్ని సార్లు బిగ్ బాస్ గా వ్యవహరించిన సల్లూ కూడా నానా రకాల ఆరోపణలు, విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది! అయినా కూడా రకరకాల కేసులతో కోర్టుల చుట్టూ తిరిగే కండల ఖాన్ కి ఈ బిగ్ బాస్ కాంట్రవర్సీలు పెద్దగా లెక్కలోకి రాలేదు. పైగా ప్రతీ గొడవా మనోడికి నెగటివ్ గానో, పాజిటివ్ గానో ఉపయోగపడింది కూడా! కాని, అలాంటి ఇమేజ్ మన ఎన్టీఆర్ ది కాదు. ఇప్పుటి వరకూ జూనియర్ పెద్ద పెద్ద వివాదాల్లోకి ఇరుక్కోలేదు. ఇప్పుడు బిగ్ బాస్ వల్ల అనవసరంగా రొంపిలోకి రావాల్సి వస్తుందేమో అని కొందరు భయపడుతున్నారు!

 

ఎన్టీఆర్ శ్రేయోభిలాషులు టెన్షన్ పడటానికి మరో కారణం… తాజాగా వార్తల్లోకి వచ్చిన తమిళ బిగ్ బాస్. ఎన్నో ఏళ్లుగా మంచి నటుడని పేరున్న కమల్ కు ఈ షో లేనిపోనీ బ్యాడ్ నేమ్ తెస్తోంది. ఆల్రెడీ జనం పెద్దగా పట్టించుకోవటం లేదని ప్రచారం జరుగుతుండగా పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది! కమల్ తమిళ సంస్కృతి చెడగొట్టే విధంగా షో నడుపుతున్నారని అక్కడ కొందరు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. బిగ్ బాస్ షో నడిచే తీరు తెలిసిన వారు ఎవరైనా సంస్కృతి విషయంలో ఆందోళన చెందటం సహజమే! అందుకే, బిగ్ బాస్ పై పదే పదే వివాదాలు రేగుతుంటాయి!

 

తెలుగు బిగ్ బాస్ జనం ముందుకొచ్చాక రెస్పాన్స్ ఎలా వుంటుందో ఇప్పుడే తెలియదు! కానీ, వివాదాలు మాత్రం తప్పకపోవచ్చన్నట్టుగా వుంది ముందస్తు పరిస్థితి. ఏది ఏమైనా తారక్ ఎలాగోలా తన ఇమేజ్ పాడుకాకుండా జాగ్రత్తపడితే మంచిది! లేదంటే కమల్, సల్మాన్ లా ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది!