ఇక "అవిశ్వాసం" అటకెక్కినట్లేనా..?

 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గత కొద్దిరోజుల నుంచి వేడెక్కిస్తోన్న అంశం అవిశ్వాస తీర్మానం. రాష్ట్రప్రయోజనాలను దెబ్బతీస్తోన్న కేంద్ర ప్రభుత్వం ఇక ఎంత మాత్రం అధికారంలో ఉండటానికి వీలు లేదన్నట్లుగా.. తాము అవిశ్వాసం పెడుతున్నాం.. మద్దతిస్తారా అని వైసీపీ అధినేత జగన్ సవాలు విసిరారు. అవిశ్వాసం బంతి అన్ని పార్టీల కాంపౌండ్‌లను చుట్టి వచ్చి.. చివరకు జగన్ దగ్గరే ఆగింది. మరి ఆయన మోడీ మీద నో కాన్పిడెన్స్ మోషన్‌కి సాహసిస్తారా...? అంటూ రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేసుకుంటూ ఉండగానే.. జగన్ అక్రమాస్తుల కేసులో మారిషస్ ప్రభుత్వం ప్రధానికి నోటీసులు పంపడంతో.. రాజకీయాలు ఊహించని మలుపు తిరిగాయి. ఈ వ్యవహారంతో ప్రధానితో పాటు బీజేపీ పెద్దలు జగన్‌పై గుర్రుగా ఉన్నారు.

 

మార్చి 4న అవిశ్వాస తీర్మానం ఇస్తే.. అది ఎలాగూ నిలబడదని జగన్మోహన్‌రెడ్డికి తెలుసు.. కాకపోతే.. దొరికిందే సందుగా ప్రతిపక్షాలు మోడీపై ఉన్న మంటను తీర్చుకుంటాయి. అది బడ్జెట్‌ ఆమోదంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అదే జరిగితే ప్రధాని.. జగన్‌పై కన్నెర్ర చేయకమానరు. అందుకే మార్చి 4కి బదులు మార్చి 21న అవిశ్వాసం ఇవ్వడానికి ప్రతిపక్షనేత సన్నాహాలు చేసుకుంటున్నారు. అలా అయితే ఇటు అవిశ్వాసం ఇచ్చినట్లు ఉంటుంది.. మరోవైపు కేంద్రప్రభుత్వానికి ఇబ్బంది లేకుండానూ ఉంటుందన్నది వైసీపీ అధినేత ప్లాన్.

 

ఇదంతా మారిషస్ గవర్నెమెంట్ నోటీసులు పంపడానికి ముందు మాట. అవిశ్వాసం పెట్టకముందే తనపై బీజేపీ నేతలు ఇంత సీరియస్‌గా ఉంటే.. అదే అవిశ్వాసం పెడితే జగన్ తిప్పలు మామూలుగా ఉండవన్నది విశ్లేషకులు మాట. ప్రస్తుతానికి నోటీసుల నుంచి ఎలా స్పందించాలో.. దీని నుంచి ఎలా బయటపడాలనే దానితోనే సరిపోతున్న వేళ.. అవిశ్వాసం గురించి పట్టించుకోవడం.. దానికి ఇతర పార్టీల మద్దతు కూడగట్టడానికి అంత తీరక లేదు.. సో.. అవిశ్వాసం అటకెక్కినట్లే..?