నిర్భయ అత్యాచార కేసులో బాలనేరస్తుడికి శిక్ష ఖరారు

 

గతేడాది డిశంబరు నెలలో జరిగిన నిర్భయ సామూహిక అత్యాచారం కేసుని మూడు నెలల్లో తేలిపోతుందని అందరూ హామీలు గుప్పించినప్పటికీ, ఇంతవరకు ఆ కేసులు తేలలేదు, దేశంలో అత్యాచారాలు ఆగలేదు. అదృష్టవశాత్తు ప్రజలకి, ప్రజా ప్రతినిధులకి కూడా షార్ట్ మెమొరీ ప్రాబ్లెం ఉండటం చేత అటువంటి నేరస్తులు కూడా తమకు ఉజ్వల భవిష్యత్ ఉందని దృడంగా నమ్ముతూ జైల్లో పరీక్షలకి కూడా ప్రిపేర్ అవగలుగుతున్నారు.

 

వయసులో అందరికంటే చిన్నవాడయినప్పటికీ మానవ జాతే అసహ్యించుకొనే విధంగా ఘోరంగా అత్యాచారం చేసి, నిర్భయ మరణానికి కారకుడయిన బాలనేరస్తుడికి కూడా మన చట్టాలలో ఉన్న లొసుగులు బాగానే ఉపయోగపడుతున్నాయి. నేరం చేసిన సమయానికి అతని వయసు 17సం.ల ఆరు నెలలు కనుక, అతను కటినమయిన శిక్షను తప్పించుకోగలుగుతున్నాడు. అసలు తను నేరమే చేయలేదని, ఆ రోజు తను బాగా తాగి పార్కులో పడుకొని ఉంటే తన తండ్రి తనను ఇంటికి మోసుకు వెళ్ళాడని వాదించాడు.

 

అయితే, ఈ రోజు బాలనేరస్థుల కోర్టు అతను నేరస్తుడని నిర్దారించింది. ఈ నెల 19న కోర్టు తన తీర్పు వెలువరించనుంది. కానీ, అతనికి అత్యధికంగా కేవలం మూడున్నర సం.లు జైలు శిక్ష మాత్రమే విధించే అవకాశం ఉంటుంది. అందులో ఇప్పటికే అతను ఒక సం.జైలులో గడిపేడు గనుక ఇక కేవలం రెండున్నర సం.లు శిక్ష అనుభవిస్తే సరిపోతుంది.

 

అంత ఘోరమయిన నేరం చేసిన్నపటికీ, ఇంత కాలం పాటు విచారణ కొనసాగడం, అంత తేలికపాటి శిక్షలతో తప్పించుకొనే అవకాశం కలిగి ఉండటం ఇటువంటి నేరాలు చేసే వారికి చట్టం అంటే భయం లేకుండా చేస్తోంది.