తెలంగాణా-సమైక్య రేసు షురూ

 

ఒకవైపు ఆంధ్రాలో సమైక్య సెంటిమెంట్ ని స్వంతం చేసుకోవడం కోసం మూడు ప్రధాన రాజకీయ పార్టీలు వీధులకెక్కి పోరాటాలు చేస్తుంటే, మరోపక్క తెలంగాణాలో కూడా దాదాపు అదే పరిస్థితి ఉంది. తెలంగాణా సాధించిన ఘనత ఎవరి ఖాతాలో వారు వ్రాసుకోవడానికి తెగ కష్టపడుతున్నారు.

 

కాంగ్రెస్ పార్టీ తెలంగాణాపై నిర్ణయం తీసుకొనే కీలక సమయంలో తనను పక్కన బెట్టి హర్ట్ చేసినప్పటికీ, మరీ హార్ట్ అయ్యి తన గుహలో (ఫాం హౌస్)లోనే కూర్చొండిపోతే, పెగ్గేసుకొని పడుకొన్నాడని ప్రజలు అపార్ధం చేసుకొంటారనో లేకుంటే మిగిలిన క్రెడిట్ కూడా కాంగ్రెస్ తన్నుకుపోతుందని భయపడో మొత్తం మీద కేసీఆర్ తన గుహలోంచి బయటకి వచ్చాడు. వచ్చి తానే తెలంగాణా సాధించినట్లు, అందువల్ల ప్రజలందరూ తనకే తెలంగాణా పునర్నిర్మాణ బాధ్యతలు కూడా అప్పగించేసినట్లు డిసైడ్ అయిపోయి, తను ఏఏ ఫైళ్ళ పాస్ చేయబోతున్నాడో, ఎవరికీ ఎంత శాతం రిజర్వేషన్లు ఇవ్వదలచుకోన్నాడో, ఏఏ ప్రాజెక్టులను ప్రారంభించబోతున్నాడో వగైరా వగైరా వివరాలను ముందుగానే ప్రకటించేస్తూ చాలా హడావుడిగా తిరుగుతున్నాడు.

 

అయితే, ఇన్నాళ్ళుగా ఆయన పక్కన కూర్చొని హోమాలు చేసి, ఆయన చేతికి బోలెడు రాఖీలు కూడా కట్టి తిరిగిన చెల్లెమ్మ రాములమ్మ మాత్రం “తెలంగాణా సాధన క్రెడిట్ మొత్తం కేసీఆర్ ఖాతాలో వ్రాసేసుకొంటే కుదరదు. నాతో సహా వెయ్యి మంది అమర వీరులకి కూడా ఆ క్రెడిట్ లో వాటా ఉంటుందని” రాములమ్మ మరిచిపోకుండా తన వాటా కూడా క్లైయిం చేసుకొంది. పనిలో పనిగా తను చేర బోతున్న కాంగ్రెస్ పార్టీని ప్రసన్నం చేసుకొనేందుకు “మా (మాజీ) అన్నగారు గురించి, ఆయన పార్టీ గురించి నేను చెప్పిన పాత రికార్డ్స్ సంగతి మర్చిపోండి. అప్పుడేదో అతను బాధపడతాడని అలా చెప్పాను కానీ నిజానికి అతనికి వంద సీట్లు కాదు కదా పది కూడా రావు. మహా అయితే మరో ఐదారు సీట్లు గెలుచుకొంటే అదే గొప్ప” అని తేల్చిపారేసింది. అంతే కాకుండా, “తెలంగాణాలో ప్రజలందరూ కూడా తెలంగాణ క్రెడిట్ ను కాంగ్రెస్ ఖాతాలోనే ఓట్ల రూపంలో జమా చేసేయడానికి ఎన్నికల కోసం చాలా ఆత్రంగా ఎదురుచూస్తున్నారని, కాంగ్రెస్ పార్టీకి ఎంత వద్దనుకొన్నాకనీసం 80 అసెంబ్లీ సీట్లు కట్టబెట్టడం ఖాయమని” ఆమె కన్ఫర్మ్ చేసేసారు. మెదక్ సీటు ఆ అపూర్వమయిన అన్నాచెల్లెళ్ళ అనుబంధాన్నిపుటుక్కున త్రెంచేయడం వల్లనే ఆమె ఈవిధంగా మాట్లాడారని ప్రజాభిప్రాయం.

 

మరి సమైక్యాంధ్ర క్రెడిట్ ఎవరికీ దక్కదని తెలిసినప్పటికీ, “గెలిచామా ఒడామా? అని కాదు ఆటలో పాల్గోన్నామా లేదా?” అనే స్పోర్టివ్ స్పిరిట్ ఉండాలి కదా. అందుకే అందరూ రాజీనామాల పోటీలు నిర్వహించుకొంటున్నారు. కానీ వైకాపా మాత్రం ఈ రేసులో ఇంతమంది వచ్చి జాయిన్ అవుతారని ఊహించక పోవడంతో కంగు తిని అందరూ ఫౌల్ గేం అడేస్తున్నారని బాధపడుతోంది.

 

అయితే తెదేపా మాత్రం “ఎప్పుడు వచ్చేమన్నది కాదు ముఖ్యం! రిజైన్ చేసామా లేదా అనేదే ముఖ్యం!” అని వాదిస్తోంది. కనీసం ఇప్పటికయినా రాష్ట్రపతి గారు దయతలచి రెండు రాష్ట్రాలు తానే ఇస్తున్నట్లు ఒక సంతకం పెట్టి ఇస్తే తప్ప ఇప్పటిలో ఈ రేసు ఆగేలా లేదు. మళ్ళీ ఆ తరువాత ముఖ్యమంత్రి రేసోకటి ఉంది కదా! వెర్రి నాగాన్నలు అలిసిపోతే మళ్ళీ పరిగెత్తలేరు పాపం!