సమైక్య పార్టీ రిలీజ్ ఎప్పుడు?

సీమాంధ్రలో కొత్త రాజకీయ పార్టీ స్థాపనకి తెర వెనుక సన్నాహాలు చాలా జోరుగానే సాగుతున్నట్లున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల తరచూ పలుకుతున్న“సమైక్యం మా విధానం, సమైక్యాంధ్ర మా నినాదమంటూ” వ్రాసి ఉన్నపోస్టర్లు, భారీ ఫ్లెక్సీ బ్యానర్లు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో, ప్రధాన కూడళ్ళలో ఇప్పుడు విరివిగా కనిపిస్తున్నాయి. కానీ పోస్టర్లలో ఏ రాజకీయ నేత ఫోటో లేకపోవడంతో, కొత్త పార్టీపై ప్రజలలో, మీడియాలో కూడా చర్చ సాగుతోంది. దానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సారధ్యం వహిస్తారని అందరూ భావిస్తున్నపటికీ ఇంతవరకు ఆయన మాత్రం బయటపడలేదు.

 

పార్టీ పెట్టకమునుపే, పార్టీ ఊరు పేరు కూడా లేకుండా ఇంత భారీ ఖర్చుతో భారీ ఎత్తున ప్రచారం చేయడం చూస్తే కనీసం రెండు మూడు పెద్ద తలకాయలు దీనివెనుక ఉండవచ్చుననిపిస్తోంది. ఒకవేళ ఇది కూడా కాంగ్రెస్ అధిష్టానం వ్యూహంలో భాగమే అయినట్లయితే, కొత్త పార్టీ స్థాపనకు తెరవెనుక నుండి కాంగ్రెస్ కూడా సహాయపడుతున్నా ఆశ్చర్యం లేదు. కానీ, ఇందులో ప్రస్తుతానికి ప్రధాన పాత్రధారులుగా ముఖ్యమంత్రి, ఆయన సహచర మంత్రులయిన శైలజానాథ్, టీజీ వెంకటేష్, గంటా శ్రీనివాసరావు, లగడపాటి తదితరులు కనిపిస్తున్నారు. వీరికి ఏపీయన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబును కూడా జోడించుకోవచ్చును. ఆయన ఈ కొత్తపార్టీలో చేరడమో లేక దానికి తమ ఉద్యోగుల పూర్తి మద్దతు అందించడమో చేయవచ్చును. బహుశః జనవరి 23ముహూర్తం ఖరారు చేసుకొని ప్రచారం మొదలుపెట్టినట్లున్నారు గనుక, ఆరోజుకి ఈ కొత్త సమైక్య పార్టీపై పూర్తి స్పష్టత రావచ్చును.