చేనేతకు చేయూతనిద్దాం

చేనేత వృత్తి కాదు ఒక నినాదం..

మనం ధరించే వస్త్రం ఒక స్ఫూర్తి..

స్వదేశీ నినాదానికి ప్రతీక..

నలుమూలల ఎగిరే ఆత్మ గౌరవ పతాక..

 

అగ్గిపెట్టే ఇమిడిపోయే ఆరుగజాల చీరను నేసిన కళానైపుణ్యం నేతన్నది. ప్రపంచానికి  మగ్గంపై నేసిన అద్భుతాలను పరిచయం చేసిన ఘనత భారతీయ నేతన్న సొంతం.

 

స్వదేశీ ఉద్యమ చిహ్నంగా చరఖా నిలిచిపోయింది. స్వతంత్య్ర ఉద్యమానికి ఖద్దరు ఇంధనమై ముందుకు సాగింది.

 

మన దేశంలో వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నది చేనేత రంగమే. దాదాపు కోటి 30లక్షల మందికి ప్రత్యేకంగా, దాదాపు తొమ్మది కోట్ల మందిరి పరోక్షంగా జీవనోపాధి కల్పిస్తోంది. 

 

చేనేత రంగంలో జాతీయ స్థాయిలో వేగంగా అభివృద్ధి సాధించడానికి 1983లో భారత ప్రభుత్వం జాతీయ చేనేత అభివృద్ధి కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసింది.  చేనేతరంగ ప్రయోజనాల కోసం, అన్ని రకాల నూలును కొనడం, నిల్వచేయడం, మార్కెటింగ్‌ వంటి కార్యకలాపాలను ఈ కార్పొరేషన్‌ చేపడుతుంది. చేనేత రంగానికి అవసరమైన రంగులు, రసాయనాలు, ముడిపదార్థాలను సబ్సిడీ ధరలపై అందించడం, చేనేత రంగంలో సాంకేతికతను పెంచండం ఈ కార్పొరేషన్‌ ప్రధాన లక్ష్యాలు. 

 

ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న చేనేత వస్త్రాల్లో  95శాతం మన దేశంలో ఉత్పత్తి అవుతుంది.  ఇంత ప్రాముఖ్యత ఉన్న ఈ రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రతి సంవత్సరం ఆగస్టు 7వ తేదీ ’జాతీయ చేనేత దినోత్సవంగా పాటించాలని  ఐదేండ్ల కిందట కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

 

7 ఆగస్టు 1905లో కోల్ కత్తా లోని టౌన్ హాల్ లో మొదటిసారి స్వదేశీ ఉద్యమానికి నాంది పలికారు. అదే స్ఫూర్తిలో 110 ఏండ్ల తర్వాత 7 ఆగస్టు 2015న చెన్నైలో జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న భారత  ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వదేశీ వస్త్రాలనే వాడాలని పిలుపునిచ్చారు.  దాంతో గత ఐదేండ్లుగా ఆగస్టు 7న ‘జాతీయ చేనేత దినోత్సవం’గా పాటిస్తున్నారు. అయితే ప్రజల్లో చేనేత వస్త్రాలపై అవగాహన పెంచేందుకు ప్రభుత్వ కార్యాలయాల్లో వారంలో ఒకరోజు చేనేత వస్త్రాలు ధరించాలన్న నియమం పెట్టారు. చేనేతకు చేయూతనిచ్చి ఆత్మగౌరవ పతాకగా మార్చడానికి అనేక చర్యలు తీసుకున్నారు.  ఆధునికతను జోడించి మగ్గాలపై అనేక ప్రయోగాలు చేస్తూ  తమ ఉనికిని కాపాడుకునే  ప్రయత్నం చేస్తున్నారు. అయితే విదేశీ వస్త్రాలపై మోజులో ప్రజలు చేనేతను నిర్లక్ష్యం చేస్తున్నారు. దళారీల కారణంగా అప్పులపాలైన నేతన్నల ఆత్మహత్యలు మాత్రం ఆగడం లేదు.  ప్రజలంతా చేయిచేయి కలిపి చేనేతకు చేయూత నివ్వాలని ఈ రంగంపై ఆధారపడిన లక్షలాది కుటుంబాలు కోరుతున్నాయి.