ఖైదీలతో పోలీసుల మందుపార్టీ..ఉద్యోగాలు ఊస్టింగ్

ఎక్కడైనా హోదా..అధికారం అడ్డోస్తాయేమో కానీ మందు దగ్గర మాత్రం అందరూ ఒక్కటే. ఈ విషయం ఎన్నో సార్లు రుజువైంది కూడా..తాజాగా కోర్టు విచారణకు తీసుకువెళ్లిన ఖైదీలతో పోలీసులు మందుకొట్టి ఉద్యోగాలు పొగొట్టుకున్నారు. మహారాష్ట్రలోని నాసిక్ సెంట్రల్ జైల్లో వార్డర్లుగా పనిచేస్తున్న ప్రమోద్ జాదవ్, సాగర్ బోధ్లే, రాహుల్ దోంగ్డేలు విచారణ నిమిత్తం ఓ ఖైదీని కోర్టుకు తీసుకువెళ్లారు. అయితే విచారణ ముగిసిన వెంటనే తిరిగి జైలుకు రావాల్సిన వారు..ప్రభుత్వ వాహనాన్ని కోర్టు ఆవరణలోనే వదిలేసి ప్రైవేట్ వాహనంలో గుర్తు తెలియని ప్రాంతానికి వెళ్లి అక్కడ మందు పార్టీ చేసుకున్నారు. ఆ తర్వాత నగరంలో కరడుగట్టిన నేరస్థుడైన గణేశ్ సురేశ్ వా ను కలిసి ముచ్చట్లు చెప్పుకున్నారు. ఎంజాయ్ చేసి చేసి అలసిపోవడంతో రాత్రి కోర్టు దగ్గరికి వెళ్లి పోలీస్ వ్యాన్‌లో తిరిగి జైలుకు చేరుకున్నారు. లేటెందుకైందని ఉన్నతాధికారులు ప్రశ్నించడంతో వ్యాన్ చెడిపోయిందని..బాగు చేసుకుని వచ్చేలోగా ఆలస్యమైందని కహానీ చెప్పారు. దీనిపై అనుమానం వచ్చిన ఉన్నతాధికారులు విచారణ చేపట్టగా మందుపార్టీ విషయం బయటకు వచ్చింది. పోలీసులై ఉండి నేరస్థులతో గడిపినందుకు వీరి ముగ్గుర్ని సర్వీసు నుంచి తొలగించారు.