పాపం "శిల్పాబ్రదర్స్"..రెండింటికి కాకుండా పోయారా..?

రెండింటికి చెడ్డ రెవడి అని మన పెద్దలు ఎందుకు అన్నారో తెలియదు కానీ ఇప్పుడు శిల్పా బ్రదర్స్‌కి ఈ సామెత అతికినట్లు సరిపోతుంది. నంద్యాల ఉపఎన్నికలో ఓటమి పాలుకావడం శిల్పా బ్రదర్స్‌ను తీవ్ర నైరాశ్యంలో ముంచింది. ఎందుకంటే వ్యక్తిగతంగా, రాజకీయంగా శిల్పా కుటుంబానికి ఇది పెద్ద ఎదురుదెబ్బ. ఎవరైనా పవర్‌ ఉన్న చోటుకు వెళ్లాలనుకుంటారు..వచ్చిన పవర్‌ను చేజేతులా వదులుకోరు. కానీ గ్రహచారమో..స్వయంకృతమో శిల్పా బ్రదర్స్‌ మాత్రం రెండోదే చేశారు. 2014లో ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు అన్నదమ్ములు. వారిలో ఒకరికి అసెంబ్లీ టికెట్, మరోకరికి జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించి గౌరవించింది తెలుగుదేశం.

 

అయితే శిల్పా ..భూమా చేతిలో ఓటమిపాలయ్యారు. అయినప్పటికీ అధికార పార్టీ కావడంతో జిల్లాలో వీరి మాటకు తిరుగులేకుండా పోయింది. ఒకదశలో దివంగత భూమా నాగిరెడ్డి సైతం వీరిని తట్టుకోలేకపోయారట. ఇక చేసేది లేక కుమార్తె అఖిలప్రియతో కలిసి తెలుగుదేశం కండువా కప్పుకున్నారు భూమా. ఎప్పుడైతే భూమా టీడీపీలోకి వచ్చాడో అప్పటి నుంచి శిల్పా బ్రదర్స్‌కి బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది. ఇరు వర్గాలు ఎక్కడో ఒక చోట కొట్టుకోవడం..అది బెజవాడ వరకు వెళ్లడం..సీఎం జోక్యంతో సద్దుమణగడం..రోజూ ఇదే పంచాయతీ. ఇదే సమయంలో భూమా గుండెపోటుతో మరణించడంతో నంద్యాలలో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ సందర్భంగా టీడీపీ టికెట్ ఆశించారు శిల్పా మోహన్ రెడ్డి అయితే పార్టీ ప్రయోజనాల దృష్ట్యా భూమా కుటుంబానికే టికెట్ కన్ఫర్మ్ చేశారు చంద్రబాబు. దీనిని ఏ మాత్రం జీర్ణించుకోలేని శిల్పా మోహన్ రెడ్డి మరో మాట లేకుండా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

 

శిల్పా బ్రదర్స్ ఎప్పుడూ ఒకే పార్టీలో ఉంటారు.. అన్న ఒక పార్టీలో..తమ్ముడు ఒక పార్టీలో ఉండరు.. సోదరుడు లేకపోవడం చక్రపాణిని మనస్తాపానికి గురి చేసింది. దీనికి తోడు జగన్ పార్టీలో మంచి ప్రాధాన్యత ఇస్తానని చెప్పడంతో ప్రచారానికి ముందు చక్రపాణి తెలుగుదేశాన్ని వీడి వైసీపీలో చేరాడు. అది కూడా అలా ఇలా కాదు..లక్షల మంది సమక్షంలో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మరీ. తీరా ఇప్పుడు ఏం జరిగింది..శిల్పా మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఓడిపోయారు.

 

ఓడిపోయింది ఎన్నికల ఒక్క విషయంలోనే కాదు రాజకీయంగా, ఆర్ధికంగా. శిల్పాబ్రదర్స్ టీడీపీని వీడకుండా ఉండి ఉంటే కర్నూలు జిల్లాను శాసించే స్థాయికి చేరుకునేవారు. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా కష్టపడి గెలిచిన శిల్పాచక్రపాణి రెడ్డిని మండలి ఛైర్మన్‌ని చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. ఇప్పుడు రెండు పోయినట్లయ్యింది..శిల్పా మోహన్‌‌రెడ్డి కూడా కొంచెం ఓర్పు వహించి వంటే 2019లో ఎంపీ అయ్యుండేవారు.    మరోవైపు నంద్యాలలో గెలుపు కోసం తన సహకార సమితిలో రుణాలు తీసుకున్న వారందరికి రుణమాఫీ చేశారని ప్రచారం జరుగుతోంది..అంత చేసినా చివరకు ఏం జరిగింది..కోట్లాది రూపాయల సోమ్ముతో పాటు రాజకీయంగా అప్రతిష్టను మూటకట్టుకుని కలిసొచ్చిన అదృష్టాన్ని స్వయం కృతంతో అన్ని విధాలుగా నష్టపోయారు.