ఫోర్బ్స్ జాబితాలో పాతికేళ్ల నల్గొండ కుర్రాడు

ప్రతిష్ఠాత్మక ఫోర్బ్స్ జాబితాలో నల్గొండ పట్టణానికి చెందిన కోణం సందీప్(25) స్థానం దక్కించుకున్నాడు. హెల్త్‌కేర్‌ సెక్టార్‌ కు సంబంధించి వినూత్న రీతిలో వైద్య, ఆరోగ్య సేవలందిస్తున్నందుకు గాను అతడికి ఈ గుర్తింపు లభించింది. ఈ విభాగంలో ఫోర్బ్స్ రూపొందించిన ‘30 అండర్ 30’ జాబితాలో సందీప్ కు స్థానం దక్కింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే మొబైల్ యాప్‌ను రూపొందించినందుకు గాను సందీప్‌కు ఈ అరుదైన గుర్తింపు లభించింది. ఇతర దేశాల్లోని వైద్యులు ఇచ్చే సూచనలు, సలహాలను ఈ యాప్ రోగుల మాతృభాషలోకి అనువదిస్తుంది.

 

కోణం సందీప్‌ 2018లో డాక్టర్‌ శివ్‌రావ్‌తో కలసి అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో అబ్రిడ్జ్‌ పేరుతో యాప్‌ సృష్టించి హెల్త్‌కేర్‌ రంగంలో రాణిస్తున్నాడు. హెల్త్‌కేర్ టెక్నాలజీకి సంబంధించి పలు యాప్‌లు రూపొందించాడు. సందీప్ కోణం పేరుతో ఓ ఫౌండేషన్‌ను కూడా స్థాపించి సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు. కాగా, పాతికేళ్ల వయసులోనే అమెరికా ఫోర్బ్స్‌ జాబితాలో స్థానం దక్కించుకున్న సందీప్ ను పలువురు అభినందిస్తున్నారు.