బీజేపీలో జేరనున్ననాగం జనార్ధన్ రెడ్డి

 

ఎన్నో పెద్ద కలలు కంటూ తెలుగుదేశం పార్టీని వీడి తెలంగాణా ఉద్యమాలలోకి ప్రవేశించిన నాగం జనార్ధన్ రెడ్డి, తెరాస అధక్షుడు హ్యాండివడమే కాకుండా, తెలంగాణా జేయేసీలోకి కూడా ప్రవేశించనీయకుండా సైంధవుడిలా అడ్డుపడటంతో ఆయన భవిష్యత్ అగమ్య గోచరంగా మారిపోయింది. తెదేపాలోకి తిరిగి వెళ్ళలేక, తెరాసలో చేరే అవకాశంలేక ఆయన చాలా నిరాశ నిస్పృహలకి లోనయ్యారు. మరిక మిగిలి ఉన్న ఏకైక పార్టీ బీజేపీలో చేరుతున్నారు. కొద్ది వారాల క్రితమే ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో కలిసి డిల్లీ వెళ్లి పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ను కలిసినప్పటికీ, పార్టీలో చేరకుండానే వెనక్కి తిరిగి వచ్చేసారు. వచ్చేనెల 3వ తేదీన హైదరాబాదులో జరుగనున్న ఒక బహిరంగ సభలో బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ సమక్షంలో ఆయన బీజేపీలో చేరుతారని కిషన్ రెడ్డి ప్రకటించారు.

 

నాగం వంటి బలమయిన నాయకుడు బీజేపీకి అవసరమయితే, బీజేపీ వంటి బలమయిన పార్టీ అండ దొరకడం ఆయనకీ కలిసి వచ్చింది. ఒకవేళ వచ్చే ఎన్నికల తరువాత కేంద్రంలో బీజేపీ గనుక అధికారంలోకి వచ్చినట్లయితే నాగం జనార్ధన్ రెడ్డికి ఇక దశ తిరిగినట్లే భావించవచ్చును. ఒకవేళ బీజేపీ అధికారంలోకి రాలేకపోయినా, ఆయనకి వచ్చే నష్టం ఏమి ఉండదు.